Telugu Global
Others

న్యాయం పేదల హక్కు

దేశంలోని నిరుపేదలైన 20 శాతం కుటుంబాలకు న్యూనతం ఆయ్ యోజన (న్యాయ్ – కనీస ఆదాయ పథకం) అమలు చేస్తామని కాంగ్రెస్ ఎన్నికల సందర్భంగా హామీ ఇవ్వడం ప్రశంసనీయమే. పేదలకు కనీస ఆదాయం ఉండేట్టు చూడాలనుకోవడం సంక్షేమ ఎజెండాలో భాగమే. ఈ అంశాన్ని మళ్లీ అందరి దృష్టికి తీసుకురావడానికి ఈ వాగ్దానం ఉపకరిస్తుంది. ప్రస్తుతం అధికారంలో ఉన్న ప్రభుత్వం మౌలిక సదుపాయాలను తమకు ఇష్టమైన రీతిలో ఎంపిక చేసి సామాజిక భద్రత అంశాన్ని విస్మరించినందువల్ల కాంగ్రెస్ వాగ్దానానికి […]

న్యాయం పేదల హక్కు
X

దేశంలోని నిరుపేదలైన 20 శాతం కుటుంబాలకు న్యూనతం ఆయ్ యోజన (న్యాయ్ – కనీస ఆదాయ పథకం) అమలు చేస్తామని కాంగ్రెస్ ఎన్నికల సందర్భంగా హామీ ఇవ్వడం ప్రశంసనీయమే. పేదలకు కనీస ఆదాయం ఉండేట్టు చూడాలనుకోవడం సంక్షేమ ఎజెండాలో భాగమే. ఈ అంశాన్ని మళ్లీ అందరి దృష్టికి తీసుకురావడానికి ఈ వాగ్దానం ఉపకరిస్తుంది.

ప్రస్తుతం అధికారంలో ఉన్న ప్రభుత్వం మౌలిక సదుపాయాలను తమకు ఇష్టమైన రీతిలో ఎంపిక చేసి సామాజిక భద్రత అంశాన్ని విస్మరించినందువల్ల కాంగ్రెస్ వాగ్దానానికి ప్రాధాన్యత ఉంది.

గత కొన్ని రోజులుగా ఈ పథకంపై జరుగుతున్న చర్చ దీనిని “భద్రత” అనుకోవాలి తప్ప ప్రభుత్వం ఇచ్చే తాయిలంగా కాదు అంటున్నారు. ఈ బాధ్యత సామాన్యులదే అనీ చెప్తున్నారు. సాధారణంగా రాజకీయ వాగ్దానాల మధ్య “సామాజిక భద్రత”కు “తాయిలాలకు” మధ్య భేదం పాటించరు. ఈ రెండు మాటలను ఒక దానికి బదులు మరొకటి వాడడం పరిపాటి అయిపోయింది.

దీనివల్ల ప్రభుత్వాలు బాధ్యత వహించకుండా తప్పించుకోవడానికి వీలవుతుంది. ప్రజలకు రాజ్యాంగ బద్ధంగా ఉన్న జీవించే హక్కుని ఖాతరు చేయకుండా దాటవేయడానికి తోడ్పడుతోంది.

అయితే ఇది కేవలం అనుమాన దృష్టితో చూసే వారి దృక్పథమా లేక వ్యవస్థాపరంగా ఇచ్చిన వాగ్దానాన్ని అమలు చేయడానికి ఉద్దేశించిందా? ఎందుకంటే ఇప్పటిదాకా మానవ జీవితాన్ని, గౌరవాన్ని ఏ మాత్రం ఖాతరు చేయలేదు.

అది హామీ అయినా, మద్దతైనా, తాయిలమైనా వీటన్నింటిలో ఇవి ఇచ్చే వారు సంరక్షకులు అన్న భావన ఉంది. ఈ సంరక్షణా తత్వం ఏ మేరకు ఆమోదయోగ్యం? ముఖ్యంగా ఇవి ప్రాధమిక హక్కులు అయినప్పుడు, లబ్ధి పొందే వారి జీవించే హక్కు అయినప్పుడు ఈ వైఖరి ఎంతవరకు సమంజసం? కనీస స్థాయిలో జీవితం గడపడానికి ప్రభుత్వం “హామీ” ఇచ్చేటట్టయితే అది పేదల బతుకులను మెరుగు పరుస్తుందని పరిశోధనల్లో తేలింది.

అయితే ఇలాంటి “హక్కుల”ను ఆ రూపంలో కాకుండా “ప్రయోజనాలు”గా పరిగణిస్తే ఇవి పక్షపాత దృష్టితో అమలు చేసే ఆస్కారం ఉంటుంది. ఇంతకు ముందు సంక్షేమ పథకాలన్నింటికీ ఇదే గతి పట్టింది. ఈ పథకాల అమలులో ఉండే సాచివేత ధోరణి, అందాల్సిన సహాయం పక్కదారి పట్టడం వల్ల పేదరిక నిర్మూలనా కార్యక్రమాలు ఎందుకూ కొరగాకుండా పోతున్నాయి. కాంగ్రెస్ వాగ్దానం చేసిన “న్యాయ్” పథకం అందరికీ వర్తించేది కాదు కనక “నిర్దిష్ట వర్గానికే” ఉద్దేశించింది కనక అనుమానాలు రేకెత్తడం సహజం. ప్రజలకు అందించవలసిన సేవల్లో ఎగుడు దిగుళ్లు, అవకతవకలు ఉన్నందువల్ల ఇవి కేవలం “తాయిలాలు” అన్న ప్రజాభిప్రాయాన్ని తోసిపుచ్చలేం.

అయినా “మంచి రోజులు” వస్తాయి అని చూడడం కన్నా కాంగ్రెస్ ప్రతిపాదించిన “న్యాయ్” పథకం కొంత మెరుగైందే. ఎవరో వస్తారు… ఏదో చేస్తారు అని ఎదురు చూడడంకన్నా కొంత మేలే. ఇది కాంగ్రెస్ ఎత్తుగడ కాదా అని ఆలోచించడం ఎలా ఉన్నా ఈ పథకాన్ని అమలు చేయడం సాధ్యమేనా అని ఆలోచించాలి.

అయిదు కోట్ల కుటుంబాలకు ఏడాదికి కనీసం రూ. 72,000 ఆదాయం ఉండాలి అన్న లెక్కలు ఎలా వేశారు అన్నది ప్రధానం. విస్తృతమైన ఈ పథకాన్ని అమలు చేసినప్పటికీ ద్రవ్య లోటు 3 శాతానికి పరిమితం చేయవచ్చునన్న అంచనాకు ఆధారం ఏమైనా ఉందా? ఇందులో కేంద్రం ఎంత భరిస్తుంది? రాష్ట్రాలు ఎంత భరించాలి? ఆంధ్రప్రదేశ్, ఒరిస్సాలాంటి రాష్ట్రాలు నగదు బదిలీ పథకాలను ఇప్పటికే అమలు చేస్తున్నందువల్ల ఈ పథకం ఎందుకు అమలు చేయాలి? పథకం అమలు చేయడానికి వ్యవస్థాపరమైన మార్పులు ఏమైనా చేస్తారా? దీనికి గతంలోని అనేక పేదరిక నిర్మూలనా, సబ్సిడీ పథకాలకు పట్టిన గతే పట్టదన్న హామీ ఏమిటి?

ఇంత విస్తృతమైన పథకం అమలు చేయడానికి చాలా ఏర్పాట్లు చేయవలసి వస్తుంది. అమలులోకి వస్తే తప్ప అనుమానాలన్నింటికీ సమాధానాలు దొరకవు. ఈ పథకం రాజకీయ పాచిక కాకుండా చూసుకోవలసిన బాధ్యత ఓటర్ల మీదే ఉంది. ఈ వాగ్దానం చేసిన పార్టీ వాస్తవ పరిస్థితి ఏమిటో వివరించాలి. అప్పుడే నిర్దిష్టమైన ఫలితాలు కనిపిస్తాయి.

ఈ పథకం అమలు కోసం నిరంతరం వేచి ఉండే దుస్థితి రాకుండా వాగ్దానం చేసిన పార్టీయే పూచీ పడాలి. న్యాయం సమయానికి జరగకపోతే అసలు న్యాయమే జరగనట్టే. ఈ రెండు సందర్భాలలోనూ ఆలోచనా సరళిలో మార్పు రావాలి. న్యాయం, గౌరవప్రదమైన జీవనం ఎవరి దయాదాక్షిణ్యాల మీద ఆధారపడినవి కావు. అవి హక్కులు అని గ్రహించాలి.

హక్కుల అమలులో వివక్షకు అవకాశం ఉండకూడదు. లేదా అత్యుత్సాహంతో కూడిన, ప్రజల ఆకాంక్షలను సొమ్ము చేసుకునే దృష్టి ఉండకూడదు. లబ్ధి పొందే వారి న్యాయమైన కోర్కెలకు మాత్రమే స్థానం ఉండాలి.

(ఎకనామిక్ అండ్ పొలిటికల్ వీక్లీ సౌజన్యంతో)

First Published:  9 April 2019 9:00 PM GMT
Next Story