ఎన్నికల వేళ రజనీకాంత్ సినిమా గోల

ఓవైపు ఆధ్యాత్మిక రాజకీయాలంటారు. మరోవైపు సినిమాలు మాత్రం ఆపరు. రాజకీయాల్లో మార్పులు తీసుకొస్తామంటారు. ఎప్పుడు చూసినా జనాల మధ్య కాకుండా సినిమా సెట్స్ లోనే ఉంటారు. చివరికి ఎన్నికల ఫీవర్ ఊపందుకున్న ఈ టైమ్ లో కూడా కొత్త సినిమా స్టార్ట్ చేసి అందర్నీ ఆశ్చర్యానికి గురిచేశారు సూపర్ స్టార్ రజనీకాంత్.

మొన్నటికిమొన్న పేట సినిమాతో థియేటర్లలోకి వచ్చిన సూపర్ స్టార్, ఇప్పుడు మరో సినిమా స్టార్ట్ చేశాడు. మురుగదాస్ దర్శకత్వంలో రజనీకాంత్ కొత్త సినిమా మొదలైంది. రజనీకాంత్ కెరీర్ లో 167వ సినిమాగా రాబోతున్న ఈ మూవీకి దర్బార్ అనే టైటిల్ ఫిక్స్ చేశారు. ముంబయిలో ఈ మూవీ ఓపెనింగ్ గ్రాండ్ గా జరిగింది. రేపట్నుంచి ఫస్ట్ షెడ్యూల్ కూడా స్టార్ట్ అవుతుంది.

రజనీకాంత్, మురుగదాస్ కాంబోలో వస్తున్న ఫస్ట్ మూవీ ఇది. ఇందులో సూపర్ స్టార్ సరసన నయనతార హీరోయిన్ గా నటించనుంది. లైకా ప్రొడక్షన్స్ బ్యానర్ పై రాబోతున్న ఈ సినిమాను వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల చేస్తారు.

రజనీకాంత్ పేట సినిమాకు సంగీతం అందించిన అనిరుధ్, దర్బార్ తో మరోసారి సూపర్ స్టార్ సినిమాకు మ్యూజిక్ అందించే ఛాన్స్ దక్కించుకున్నాడు. పేట సినిమా ఫ్లాప్ అయినా మ్యూజిక్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. అందుకే రజనీకాంత్ మరోసారి అనిరుధ్ కు ఛాన్స్ ఇచ్చాడు. ఈ సినిమా పూర్తిచేసి తీరిగ్గా రాజకీయాల గురించి ఆలోచిస్తారేమో రజనీకాంత్.