అర్థరాత్రి వరకు కొనసాగిన పోలింగ్.. చివరి బూత్‌లో 12.30కు ముగింపు

ఏపీలో ఎన్నికల పోలింగ్ మునుపెన్నడూ లేని విధంగా అర్థ రాత్రి దాటిన తర్వాత కూడా కొనసాగింది. అత్యంత సూదీర్ఘంగా గురువారం ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్.. అర్థ రాత్రి 12.30 గంటల వరకు అంటే పదిహేడున్నర గంటల పాటు కొనసాగింది. ఒక ఎన్నిక రెండు క్యాలెండర్ రోజులు పాటు సాగడం ఇదే తొలిసారి. బ్యాలెట్ ఉపయోగించ రోజుల్లో కూడా ఇంత సుదీర్ఘంగా జరిగిన దాఖలాలు లేవని అధికారులు చెప్పడం గమనార్హం.

గురువారం ఉదయం పోలింగ్ ప్రారంభమయ్యే సమయానికి చాలా చోట్లు ఈవీఎంలు మొరాయించడంతో చాలా ఆలస్యంగా ఓటింగ్ ప్రారంభమైంది. అప్పటికే చాలా మంది బూత్‌ల నుంచి వెనుదిరిగారు. అయితే సాయంత్రానికి ఈవీఎంలు పని చేస్తున్నాయని, 6 గంటల వరకు లైన్లో ఉంటే ఓటింగ్‌కు అనుమతిస్తామని ఈసీ చెప్పడంతో వోటర్లు వేల సంఖ్యలో బారులు తీరారు. దీంతో 6.00 గంటలకు లైన్లో ఉన్న చివరి వ్యక్తికి ఓటు వేయడానికి అర్థరాత్రి అవకాశం వచ్చింది.

256 కేంద్రాల్లో 10 గంటల వరకు, 139 కేంద్రాల్లో 10.30 వరకు, 70 కేంద్రాంల్లో 11 గంటల వరకు.. 14 కేంద్రాల్లో రాత్రి 12.30 గంటల వరకు పోలింగ్ నిర్వహించారు. కాగా, సాయంత్రం 6 గంటలకు 71.43 శాతం వరకు పోలింగ్ నమోదయ్యిందని ఈసీ ప్రకటించింది. ఇక ఆ తర్వాత అర్థరాత్రి వరకు ఓటేసిన వారిని కూడా పరిగణలోకి తీసుకున్న తర్వాత 80 శాతంపైన పోలింగ్ జరిగే అవకాశం ఉందని రాత్రి 11.30 సమయంలో సీఈవో గోపాలకృష్ణ ద్వివేది చెప్పారు.