మరోసారి ఫెయిలైన దేవిశ్రీప్రసాద్

రీసెంట్ గా దేవిశ్రీప్రసాద్ మంచి మ్యూజిక్ ఇచ్చిన సినిమా ఒక్కటి కూడా కనిపించడం లేదు. ఇంకా గట్టిగా మాట్లాడుకుంటే రంగస్థలం తర్వాత అతడి మ్యూజిక్ అంతోఇంతో క్లిక్ అయింది చిత్రలహరి సినిమాలోనే. ఇప్పుడు మహర్షితో మరోసారి నెగెటివ్ కామెంట్స్ అందుకుంటున్నాడు ఈ సంగీత దర్శకుడు.

మహర్షి సినిమాకు సంబంధించి ఈరోజు సెకెండ్ సింగిల్ రిలీజ్ చేశారు. నువ్వే సమస్తం అనే లిరిక్స్ తో సాగే ఈ పాట నిజానికి ఓ మాంటేజ్ సాంగ్. మహేష్ పై మాంటేజ్ సాంగ్ అనగానే చాలామంది భరత్ అనే నేను సినిమాలో థీమ్ సాంగ్ తో సమానంగా ఊహించుకున్నారు. దీంతోపాటు శ్రీమంతుడు సినిమాలో ఉన్న “పోరా శ్రీమంతుడా” అనే పాట రేంజ్ లో ఉంటుందని ఎక్స్ పెక్ట్ చేశారు.

కానీ మహర్షి మాంటేజ్ సాంగ్ ఆ అంచనాల్ని అందుకోలేకపోయింది. శ్రీమణి రాసిన సాహిత్యం ఆశించిన స్థాయిలో లేకపోగా.. దేవిశ్రీ అందించిన సంగీతంలో కూడా కొత్తదనం కనిపించలేదు. ఇంకా చెప్పాలంటే “పోరా శ్రీమంతుడా” సాంగ్ ను బీట్ చేసే రేంజ్ పాట కాదిది.

మహర్షి సినిమాపై భారీ అంచనాలున్నాయి. కానీ ఎప్పుడైతే సింగిల్స్ రిలీజ్ కార్యక్రమం షురూ చేశారో ఆ అంచనాలు క్రమేనా తగ్గడం మొదలయ్యాయి. మొదటి పాట క్లిక్ అవ్వలేదు. కాస్త అంచనాలు తగ్గాయి. ఇప్పుడు రెండో పాట కూడా క్లిక్ అవ్వలేదు. ఇంకాస్త అంచనాలు తగ్గాయి. అదీ సంగతి