మళ్లీ కలిసిన మహేష్-త్రివిక్రమ్

సడెన్ గా అందరికీ షాకిచ్చాడు మహేష్ బాబు. త్రివిక్రమ్ తో సెట్స్ లో సీరియస్ గా సీన్ పై చర్చిస్తున్న ఓ ఫొటోను పోస్ట్ చేశాడు. చాన్నాళ్ల తర్వాత మళ్లీ సెట్స్ పైకి వచ్చామంటూ ట్వీట్ కూడా చేశాడు. దీంతో అంతా షాకయ్యారు. వీళ్లిద్దరి కాంబోలో సినిమా అస్సలు చర్చల్లోనే లేదు. అలాంటిది ఏకంగా సెట్స్ పైకి ఎలా వెళ్లిందబ్బా అంటూ చాలామంది తలపట్టుకున్నారు. కానీ అసలు మేటర్ అది కాదు.

సినిమాలతో పాటు సమాంతరంగా యాడ్స్ కూడా చేస్తుంటాడు మహేష్ బాబు. అందులో భాగంగా త్రివిక్రమ్ దర్శకత్వంలో ఓ యాడ్ లో నటిస్తున్నాడు. ఆ యాడ్ కు సంబంధించిన మేకింగ్ షాట్ నే విడుదల చేశాడు. త్రివిక్రమ్ తో కలిసి పనిచేస్తున్నందుకు హ్యాపీగా ఉందంటూ ట్వీట్ చేశాడు.

మహేష్-త్రివిక్రమ్ కలిసి అతడు, ఖలేజా సినిమాలు చేశారు. ఈ సినిమాలతో పాటు వీళ్లిద్దరి కాంబోలో ఇప్పటికే పలు వాణిజ్య ప్రకటనలు కూడా వచ్చాయి. ఇప్పుడు వీటికి అదనంగా ఇది కూడా తోడైందన్నమాట.

అన్నట్టు మహేష్ బాబు ట్వీట్ పై చిన్న సైజు ట్రోలింగ్ కూడా షురూ అయింది. ఈ ఫోకస్ ఏదో సినిమాపై పెడితే, ఈపాటికి మహర్షి సినిమా అనుకున్న టైమ్ కు థియేటర్లలోకి వచ్చేదంటూ కొందరు విమర్శించారు. ఆ యాడ్స్ పక్కనపెట్టి గట్టిగా కూర్చుంటే ఓ మంచి సినిమా సెట్ అయ్యేది కదా అని మరికొందరు మహేష్ పై సెటైర్లు స్టార్ట్ చేశారు.