తమన్ మ్యూజిక్ మళ్లీ మొదలైంది

బన్నీ-తమన్ కాంబినేషన్ పై భారీ అంచనాలున్నాయి. ఎందుకంటే గతంలో అల్లు అర్జున్ చేసిన రేసుగుర్రం సినిమాకు పాటలిచ్చింది ఇతడే. ఆ పాటలు పెద్ద హిట్. ఆ తర్వాత సరైనోడు సినిమాకు మ్యూజిక్ ఇచ్చింది కూడా ఇతడే. అందులో పాటలు కూడా చాలా బాగుంటాయి. అందుకే వీళ్లిద్దరి కాంబినేషన్ పై అంచనాలు ఎక్కువ. ఇప్పుడు వీళ్ల కాంబోలో మరో సినిమా వస్తోంది. త్రివిక్రమ్ దర్శకత్వంలో బన్నీ చేయబోతున్న సినిమాకు తమన్ సంగీతం అందిస్తున్నాడు. ఆ సినిమా మ్యూజిక్ సిట్టింగ్స్ ప్రారంభమయ్యాయి.

బన్నీ-తమన్ మధ్య మంచి సింక్ ఉంది. అలానే అరవింద సమేత సినిమాతో త్రివిక్రమ్-తమన్ కు కూడా మంచి అండర్ స్టాండింగ్ కుదిరింది. అరవింద సమేతలో తమన్ వర్క్ కు త్రివిక్రమ్ ఫిదా అయ్యాడు. అందుకే తన నెక్ట్స్ సినిమాకు కూడా అతడ్నే సెలక్ట్ చేసుకున్నాడు. ప్రస్తుతం ఈ మ్యూజిక్ సిట్టింగ్స్ లో త్రివిక్రమ్ మాత్రమే ఉన్నాడు. త్వరలోనే బన్నీ కూడా జాయిన్ అవుతాడు.

ఈనెల 24 నుంచి సెట్స్ పైకి రాబోతోంది బన్నీ-త్రివిక్రమ్ మూవీ. ఈ గ్యాప్ లో లాంఛనంగా పూజా కార్యక్రమాలు నిర్వహించాలని అనుకుంటున్నారు. పూజా హెగ్డే హీరోయిన్ గా నటించబోతున్న ఈ సినిమాలో ఓ కీలక పాత్ర కోసం సునీల్ ను కూడా తీసుకున్నారు. హారిక-హాసిని, గీతాఆర్ట్స్ బ్యానర్లపై ఈ సినిమా రాబోతోంది.