లాంఛనంగా మొదలుపెట్టిన అల్లు అర్జున్

అల్లు అర్జున్, త్రివిక్రమ్ కాంబినేషన్ లో రావాల్సిన కొత్త సినిమాను ఈనెల 24 నుంచి సెట్స్ పైకి తీసుకురాబోతున్నట్టు నిర్మాతలు ఇదివరకే ప్రకటించారు. ఇప్పుడా సినిమాకు సంబంధించి పూజా కార్యక్రమాలు నిర్వహించారు. రామానాయుడు స్టుడియోస్ లో ఈ సినిమా లాంఛనంగా ప్రారంభమైంది. ముహూర్తం షాట్ కు బన్నీనే క్లాప్ కొట్టాడు. దేవుడి పటాలపై ఫస్ట్ షాట్ తీశారు.

చాలా సింపుల్ గా, ఎలాంటి ప్రత్యేక అతిథులు లేకుండా ఈ సినిమా ప్రారంభోత్సవాన్ని ముగించారు. బన్నీ, త్రివిక్రమ్ తో పాటు నిర్మాతలు చినబాబు, అల్లు అరవింద్ మాత్రమే కనిపించారు. యూనిట్ కు సంబంధంలేని మరో ప్రముఖుడు కార్యక్రమంలో కనిపించలేదు.

ఈ సినిమాకు సంబంధించి ఇప్పటికే ప్రీ-ప్రొడక్షన్ పనులు స్టార్ట్ చేశారు. తమన్ పాటల కంపోజిషన్ మొదలుపెట్టాడు. రామోజీ ఫిలింసిటీలో సెట్ నిర్మాణం ప్రారంభమైంది. హీరోయిన్ పూజా హెగ్డే కాల్షీట్లు కూడా ఎడ్జెస్ట్ అయ్యాయి. సో.. 24 నుంచి సినిమా పరుగులు పెట్టబోతోందన్నమాట.

హారిక-హాసిని, గీతా ఆర్ట్స్ బ్యానర్లపై ఈ సినిమా రాబోతోంది. బన్నీ-త్రివిక్రమ్ కాంబోలో ఇది మూడో సినిమా. ఇంతకుముందు వీళ్లిద్దరి కాంబోలో జులాయి, సన్నాఫ్ సత్యమూర్తి సినిమాలొచ్చాయి.