Telugu Global
NEWS

మహిళల ఓట్లు ఎవరికి మహానుభావా ?

సాయంత్రం నాలుగైంది. ఎండ కాసింత తగ్గింది. ఇంటి పనులతో సతమతమవుతున్న ఒక్కొక్కరే ఇంట్లోంచి బయటకు రావడం ప్రారంభమైంది. పోలింగ్ బూత్ ల ముందు లైన్లు మెల్లిమెల్లిగా పెరగడం ప్రారంభమైంది. క్యూ లో చేరుతున్న మహిళల సంఖ్య మెల్లిమెల్లిగా పెరుగుతోంది. సాయంత్రం ఆరయింది. ఓటు వేసేందుకు మహిళలు భారీ సంఖ్యలో వచ్చారు. వారంతా రాత్రి పది గంటలైనా క్యూల నుంచి కదల్లేదు… మెదల్లేదు. లైన్ లో చివరి వరకు ఉన్న మహిళలు కూడా తమ ఓటు హక్కును వినియోగించుకునే […]

మహిళల ఓట్లు ఎవరికి మహానుభావా ?
X

సాయంత్రం నాలుగైంది. ఎండ కాసింత తగ్గింది. ఇంటి పనులతో సతమతమవుతున్న ఒక్కొక్కరే ఇంట్లోంచి బయటకు రావడం ప్రారంభమైంది. పోలింగ్ బూత్ ల ముందు లైన్లు మెల్లిమెల్లిగా పెరగడం ప్రారంభమైంది. క్యూ లో చేరుతున్న మహిళల సంఖ్య మెల్లిమెల్లిగా పెరుగుతోంది.

సాయంత్రం ఆరయింది. ఓటు వేసేందుకు మహిళలు భారీ సంఖ్యలో వచ్చారు. వారంతా రాత్రి పది గంటలైనా క్యూల నుంచి కదల్లేదు… మెదల్లేదు. లైన్ లో చివరి వరకు ఉన్న మహిళలు కూడా తమ ఓటు హక్కును వినియోగించుకునే ఇంటికి వెళ్లారు.

ఇలా పట్టుదలగా ఓట్లు వేసిన మహిళలు ఎవరికి జై కొట్టారో మాత్రం ఆంధ్రప్రదేశ్ లోనే కాదు… మొత్తం తెలుగు వారు ఉన్న అన్ని ప్రాంతాల్లోనూ చర్చనీయాంశమైంది. గతంలో ఎన్నడూ లేనంతగా ఓటింగ్ శాతం విపరీతంగా పెరిగింది. దీనికి కారణం మహిళలు, వృద్ధులు అధిక సంఖ్యలో వచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకోవడం అని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.

ఇలా తండోపతండాలుగా వచ్చి ఓట్లు వేసిన వారు ఎవరి పక్కన నిలిచారన్నదే మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది. పసుపు కుంకుమ పథకం కారణంగా మహిళలు పెద్ద సంఖ్యలో వచ్చి తమకు ఓట్లు వేసారని అధికార తెలుగుదేశం పార్టీ ఆశలు పెట్టుకుంది. ఈ ఓట్లు తమని గట్టెక్కిస్తాయని తెలుగుదేశం అభ్యర్థులు ఊహాలోకంలో విహరిస్తున్నారు.

పోలింగ్ బూత్ ముందు క్యూలో నిలబడి ఓట్లు వేసిన మహిళలు తాము ఎవరి పక్కన ఉన్నామో మాత్రం పెదవి విప్పడం లేదు. దీని వెనుక అధికార తెలుగుదేశం పార్టీని తిరస్కరించారనే మర్మం దాగి ఉందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. తమకు పదివేల రూపాయలు ఇచ్చిన చంద్రబాబు నాయుడుకి మద్దతు పలికామని చెప్పడంలో మహిళలు ఎందుకు సందేహిస్తున్నారు అనే ప్రశ్నలు వస్తున్నాయి.

తాము ఎవరి పక్షం ఉన్నామో వెల్లడిస్తే పసుపు కుంకుమ డబ్బులపై ప్రశ్నలు వస్తాయని, ఆ భయమే మహిళలు పెదవి విప్పకుండా చేస్తోందని విశ్లేషకులు అంటున్నారు.

గతంలో మహిళలు తాము ఎవరికి ఓటు వేసామో బహిరంగంగాను, బాహాటంగానూ చెప్పేవారు. ముఖ్యంగా అధికారంలో ఉన్న పార్టీకి వేస్తే ఆ విషయాన్ని మహిళలు నిస్సంకోచంగా వెల్లడించేవారంటున్నారు. ఈసారి ఆ పరిస్థితి ఎక్కడా కనిపించడం లేదంటున్నారు. దీనర్థం పసుపు కుంకుమ దారి దానిదే… ఓట్ల దారి ఓట్లదే అని మహిళలు నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తోంది అని రాజకీయ పండితులు అంటున్నారు.

ఈ పరిణామాలను విశ్లేషిస్తే మహిళలు గంపగుత్తగా ప్రతిపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఓటు వేశారని భావించాలని విశ్లేషకులు చెబుతున్నారు. ఇలా ఓటు వేసిన వారంతా వ్యతిరేకంగా ఉన్న వారే నని అంచనా వేస్తున్నారు. మహిళల ఓట్లు తమకే పడ్డాయని పైకి చెబుతున్నప్పటికీ తెలుగుదేశం పార్టీ నాయకులు, అభ్యర్థుల్లో మాత్రం ఓ భయం నీడలా వెంటాడుతోందంటున్నారు. ఆడవారి మాటలకే కాదు చేతలకీ అర్ధాలు వెతకడం అంత సులభం కాదు.

First Published:  12 April 2019 11:11 PM GMT
Next Story