గోదావరిలో ఫ్యాన్ గలగల… సైకిల్ డీలా !

ఆంధ్రప్రదేశ్ ఎన్నికలలో ఆ రెండు జిల్లాలు కీలకం. అక్కడ ఏ పార్టీ ఎక్కువ స్థానాలు గెలుచుకుంటే అధికారం ఆ పార్టీదే అని ఓ నమ్మకం. గత ఎన్నికలు పరిశీలించిన వారెవరికైనా ఈ విషయం నిజమేననిపిస్తుంది. రాష్ట్ర విభజన తర్వాత జరిగిన ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడానికి ఆ రెండు జిల్లాలే కారణం.

ఇంతకీ అవి ఏ జిల్లాలు అనుకుంటున్నారా. ఆ జిల్లాలే తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాలు. ఈ రెండు జిల్లాల్లో ఈసారి జరిగిన ఎన్నికలు నువ్వానేనా అన్న స్థాయిలో ఉన్నాయి. గత ఎన్నికలలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి పశ్చిమ గోదావరి జిల్లాలో ఒక్కటంటే ఒక్క స్థానం కూడా రాలేదు. ఆ ఎన్నికలలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ తూర్పుగోదావరి జిల్లాలో కూడా తక్కువ స్థానాలే గెలుచుకుంది. పశ్చిమ గోదావరి జిల్లాలో 14 స్థానాలు ఉంటే అన్నింటినీ తెలుగుదేశం పార్టీ తన ఖాతాలో వేసుకుంది.

తూర్పుగోదావరి జిల్లాలో 19 స్థానాలు ఉంటే పద్నాలుగు స్థానాల్లో తెలుగుదేశం పార్టీ విజయం సాధించి అధికారాన్ని కైవసం చేసుకుంది. అయితే ఈ ఎన్నికలలో మాత్రం ఆ పరిస్థితి పూర్తిగా తారుమారైంది అంటున్నారు. ప్రస్తుత ఎన్నికలలో ఉభయగోదావరి జిల్లాల్లో ఫ్యాన్ జోరు మరింత ఎక్కువగా ఉందని ఆ జిల్లాలకు చెందిన రాజకీయ విశ్లేషకులు, సీనియర్ జర్నలిస్టులు చెబుతున్నారు.

కాపు సామాజిక వర్గం ఎక్కువగా ఉండే ఉభయ గోదావరి జిల్లాల్లో ఈ సారి ఎన్నికల ఫలితాలు కొత్తగా ఉండనున్నాయి. ప్రముఖ హీరో పవన్ కళ్యాణ్ ఏర్పాటు చేసిన జనసేన ఈసారి ఎన్నికల బరిలో ఉండటంతో ఉభయగోదావరి జిల్లాల్లో ఫలితాలు తెలుగుదేశం పార్టీకి అనుకూలించేలా కనిపించడం లేదు.

పశ్చిమగోదావరి జిల్లాలో ఉన్న 14 స్థానాలలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ 9 నుంచి 12 స్థానాల్లో గెలిచే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని అంటున్నారు. ఈ జిల్లాలో జనసేన నుంచి పోటీ చేసిన అభ్యర్థులు తెలుగుదేశం పార్టీకి చెందిన ఓట్లను భారీగా చీలుస్తున్నారని సమాచారం. జిల్లాలోని భీమవరం నియోజకవర్గం నుంచి జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పోటీ చేయడంతో ఇక్కడ ఎన్నికల పోరు రసవత్తరంగా మారింది. గత ఎన్నికలలో కాపు సామాజిక వర్గానికి చెందిన ఓట్లు తెలుగు దేశం పార్టీకి అనుకూలంగా పడ్డాయి. ఈసారి ఆ ఓట్లన్నీ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ, జనసేన కు మళ్ళినట్లుగా చెబుతున్నారు.

పశ్చిమగోదావరి జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అత్యధిక స్థానాలు వచ్చే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఇక తూర్పుగోదావరి జిల్లాలో పరిస్థితి ఇలాగే ఉంది. జిల్లాలో ఉన్న 19 నియోజక వర్గాలలో కనీసం 11 నియోజకవర్గాలలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ గెలిచే అవకాశం ఉందని చెబుతున్నారు. దీనికి కారణం తెలుగుదేశం పార్టీ నుంచి పోటీ చేసిన అభ్యర్థులపై అవినీతి ఆరోపణలు ఎక్కువగా ఉండడమేనని అంటున్నారు.

అలాగే ఈ జిల్లాలో ఉన్న కాపు సామాజిక వర్గం ఓట్లు చీలి పోయాయని, కొన్ని ఓట్లు జనసేనకి పడితే ఇంకొన్ని వైయస్సార్ కాంగ్రెస్ కు పడ్డాయని అంచనా వేస్తున్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో ఉభయ గోదావరి జిల్లాల్లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ తిరుగులేని ఆధిక్యం సాధిస్తుందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.