Telugu Global
NEWS

అమ్మాయి పట్టు... అబ్బాయిలు ఫట్టు

కుర్రాళ్లతో కుస్తీ పడుతున్న మహారాష్ట్ర యువతి మహిమ తండ్రి ప్రేరణతో కుస్తీ బరిలో మహిమా రాథోడ్ ఇటు కుస్తీ పట్లు….అటు పదోతరగతి పరీక్షలు కుస్తీ…మల్లయోధుల క్రీడ. ఇతిహాసకాలం నాటి ఈ క్రీడలో….నేటితరం మహిళలు సైతం ఉత్సాహంగా పాల్గొంటూ తమ సత్తా చాటుకొంటున్నారు. అయితే…హర్యానా, మహారాష్ట్ర గ్రామీణ ప్రాంతాల నుంచి భారత కుస్తీలోకి దూసుకొస్తున్న యువతులు… జాతీయస్థాయిలో గుర్తింపు తెచ్చుకోడానికి… ప్రాథమిక దశలో శిక్షణ పొందటానికి పడుతున్న పాట్లు, కష్టాలు అన్నీ ఇన్నీ కావు. దంగల్ సినిమాకు తీసిపోని కథే […]

అమ్మాయి పట్టు... అబ్బాయిలు ఫట్టు
X
  • కుర్రాళ్లతో కుస్తీ పడుతున్న మహారాష్ట్ర యువతి మహిమ
  • తండ్రి ప్రేరణతో కుస్తీ బరిలో మహిమా రాథోడ్
  • ఇటు కుస్తీ పట్లు….అటు పదోతరగతి పరీక్షలు

కుస్తీ…మల్లయోధుల క్రీడ. ఇతిహాసకాలం నాటి ఈ క్రీడలో….నేటితరం మహిళలు సైతం ఉత్సాహంగా పాల్గొంటూ తమ సత్తా చాటుకొంటున్నారు. అయితే…హర్యానా, మహారాష్ట్ర గ్రామీణ ప్రాంతాల నుంచి భారత కుస్తీలోకి దూసుకొస్తున్న యువతులు… జాతీయస్థాయిలో గుర్తింపు తెచ్చుకోడానికి… ప్రాథమిక దశలో శిక్షణ పొందటానికి పడుతున్న పాట్లు, కష్టాలు అన్నీ ఇన్నీ కావు.

దంగల్ సినిమాకు తీసిపోని కథే మహారాష్ట్రలోని యవత్ మాల్ జిల్లాకు చెందిన యువ మల్లయోధురాలు, 16 ఏళ్ల మహిమా రాథోడ్ జీవితం.

మల్లయోధుల కుటుంబం నుంచి….

యవత్మాల్ జిల్లా లోని పూసద్ తాలూకా దుర్గా గిరి గ్రామానికి చెందిన మహిమది ..తరతరాలుగా వస్తాదుల కుటుంబమే. మహిమ తాతలు, తండ్రులు స్వయంగా వస్తాదులే. తాత, తండ్రితో పాటు ఎనిమిదిమంది బాబాయిలు, పెదనానలు, మేనమామలు సైతం కుస్తీ క్రీడతో సంబంధం ఉన్నవారే కావడం విశేషం.

మహిమ తండ్రి ప్రసాద్ రాథోడ్ కు కుస్తీ అంటే ఎంతో ఇష్టం. జాతీయస్థాయి లో వస్తాదుగా సత్తా చాటుకోవాలని తహతహలాడాడు. అయితే ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉండడంతో… తన తొలి సంతానాన్ని…. కుస్తీ క్రీడలోకి దించాలని నిర్ణయించాడు.

కొడుకుపుడతాడని కలలు కన్న ప్రసాద్ రాథోడ్ కు చివరకు మహిమ రూపంలో ఓ ఆడబిడ్డ జన్మించింది. కూతురు పుట్టడంతో తీవ్ర నిరాశకు గురైన ప్రసాద్…తన సోదరుడితో చర్చించి…కూతురు మహిమనే వస్తాదుగా తయారు చేయాలని నిర్ణయించుకొన్నాడు.

శిక్షణ కష్టాలు….

మహిమ బాల్యం నుంచే తండ్రి గురువుగా కుస్తీలో ఓనమాలు దిద్దుకొంది. అయితే ఆమెతో కుస్తీ పట్టడానికి తోటి ఈడు ఆడపిల్లలు ఎవ్వరూ లేకపోడంతో…అబ్బాయిలతోనే కుస్తీ పడుతూ సాధన చేయాల్సి వచ్చింది.

అబ్బాయిలు సైతం అమ్మాయితో కుస్తీ ఏంటంటూ… ముందుకు రాకపోవడంతో…ఐదు లేదా పది రూపాయలు ఇచ్చి మరీ కుస్తీ పట్టాల్సి వచ్చేది.

అమ్మాయికి కుస్తీ ఏంటంటూ ఊరివారు గేలి చేస్తున్నా…తండ్రి, కుటుంబసభ్యుల ప్రోత్సాహంతో వస్తాదుగా ఎదిగిన మహిమ తాలూకాస్థాయి కుస్తీ పోటీలలో ఓ అబ్బాయిని ఓడించి మరీ బంగారు పతకం సాధించింది.

నాన్నకే పతకం అంకితం….

ఓ మల్లయోధురాలిగా తాను సాధించిన తొలి పతకాన్ని నాన్న ప్రసాద్ రాథోడ్ కు మహిమ అంకితమిచ్చింది. తనకోసం కుటుంబసభ్యులు ఎన్నో త్యాగాలు చేశారని గుర్తు చేసుకొంది.

కేంద్రప్రభుత్వం ఇచ్చే 15వేల రూపాయల ఉపకార వేతనంతో తన శిక్షణ కొనసాగిస్తున్న మహిమ… పాట్నా వేదికగా జరిగే జాతీయ కుస్తీపోటీలలో పాల్గొనటానికి అర్హత సంపాదించింది.

నిజామాబాద్ జిల్లా కుస్తీ పోటీలలో….

నిజామాబాద్ జిల్లా బోధన్ మండలం సాలూరు గ్రామంలో ఇటీవలే ముగిసిన మహా శివరాత్రి వేడుకల్లో భాగంగా నిర్వహించిన కుస్తీ పోటీలకే మహిమ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. పోటీలో 16 ఏళ్ల మహిమ..కుర్రాళ్లతో పోటీ పడి మరీ విజేతగా నిలిచింది.

గత తొమ్మిదేళ్లుగా కుస్తీ పోటీలలో పాల్గొంటూ వస్తున్న మహిమ ప్రతిభకు మెచ్చిన నిర్వాహక సంఘం నిర్వాహకులు 5 వేల రూపాయలు బహుమతిగా ఇచ్చి ప్రోత్సహించారు.

ఓవైపు జాతీయ కుస్తీ పోటీల కోసం సాధన చేస్తూనే…మరోవైపు 10వ తరగతి ఫైనల్ పరీక్షలకు మహిమ సిద్ధంకావాల్సి వస్తోంది.

గ్రామీణ ప్రాంతాలకు చెందిన మహిమ లాంటి యువతులు కట్టుబాట్లు, ఆర్థిక సమస్యలను అధిగమించి…కుస్తీ లాంటి క్రీడలో పాల్గొనడం నిజంగా అభినందనీయం. కేంద్రప్రభుత్వం ప్రవేశపెట్టిన ఖేలో ఇండియా పథకం ద్వారా మహిమ రాథోడ్ వెలుగులోకి రావాలని, అంతర్జాతీయ వస్తాదుగా గుర్తింపు పొందాలని కోరుకొందాం.

First Published:  13 April 2019 9:57 PM GMT
Next Story