మళ్లీ నాగార్జునతో…. నాగచైతన్య

2016 లో ‘సోగ్గాడే చిన్నినాయన’ సినిమాతో అక్కినేని నాగార్జున సూపర్ హిట్ అందుకున్న సంగతి తెలిసిందే. కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించింది.

తాజాగా ఈ సినిమాలోని బంగార్రాజు పాత్ర ఆధారంగా ‘బంగార్రాజు’ సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రానున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో నాగార్జున హీరోగా నటిస్తున్నారు.

అయితే తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాలో అక్కినేని నాగచైతన్య కూడా ఒక ముఖ్య పాత్ర పోషిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ నేపధ్యంలో ఈ సినిమాపై ఈ మధ్యనే క్లారిటీ ఇచ్చాడు చై.

“నేను మళ్లీ డాడీ తో కలిసి ‘బంగార్రాజు’ సినిమాలో నటిస్తున్నాను. ప్రస్తుతం స్క్రిప్ట్ పనులు జరుగుతున్నాయి” అని అన్నాడు. కానీ ఈ సినిమాలో తన పాత్ర ఎలా ఉండబోతుంది అని మాత్రం ఇంకా తెలియాల్సి ఉంది.

మరోవైపు ఈ సినిమాలో అక్కినేని అఖిల్ కూడా క్యామియో పాత్రలో కనిపించబోతున్నారు అని వార్తలు బయటకు వచ్చాయి. కానీ అందులో ఎంత వరకు నిజం ఉందో ఇప్పుడే చెప్పలేం. అన్నీ అనుకున్నట్లు జరిగితే ఈ సినిమా షూటింగ్ జూలై నుండి సెట్స్ పైకి వెళ్లనుంది. త్వరగా సినిమా షూటింగ్ పూర్తిచేసి 2020 లో ఈ సినిమాను విడుదల చేయాలని కళ్యాణ్ కృష్ణ ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. ఇప్పటికే నాగచైతన్య మరియు నాగార్జున కలిసి ‘మనం’ సినిమాలో నటించిన సంగతి తెలిసిందే.