ఏడాది గ్యాప్ మరో ఏడాదిలో కవర్ చేస్తాడట!

సరిగ్గా ఏడాది కిందటొచ్చింది నా పేరు సూర్య సినిమా. అది ఫ్లాప్ అయిన తర్వాత పూర్తిగా సినిమాలు పక్కనపెట్టేశాడు బన్నీ. ఎన్నో కథలు విన్నాడు, ఏదీ ఫైనల్ చేయలేకపోయాడు. ఫైనల్ గా తన కెరీర్ కు కలిసొచ్చిన త్రివిక్రమ్ తో కలిసి ఈనెల 24 నుంచి సెట్స్ పైకి వెళ్లబోతున్నాడు. అయితే ఇక్కడితో ఆగట్లేదు అల్లు అర్జున్. ఇన్నాళ్లూ తీసుకున్న ఏడాది గ్యాప్ ను వీలైనంత తొందరగా కవర్ చేయాలని ఫిక్స్ అయ్యాడు.

అవును.. త్రివిక్రమ్ సినిమాను రికార్డు టైమ్ లో పూర్తిచేయాలని ఫిక్స్ అయ్యాడు బన్నీ. అన్నీ అనుకున్నట్టు జరిగితే సరిగ్గా 4 నెలల్లో ఈ సినిమాను పూర్తిచేస్తారు. ఇది కంప్లీట్ అయిన వెంటనే, ఏమాత్రం గ్యాప్ ఇవ్వకుండా సుకుమార్ సినిమాను సెట్స్ పైకి తీసుకురాబోతున్నాడు. అది కూడా తొందరగా పూర్తిచేసి దిల్ రాజు బ్యానర్ పై వేణు శ్రీరామ్ దర్శకత్వంలో ఐకాన్ మూవీని పట్టాలపైకి తీసుకురావాలనేది బన్నీ ప్లాన్. ఇలా ఏడాదిన్నరలో ఈ 3 సినిమాల్ని థియేటర్లలోకి తీసుకురావాలనుకుంటున్నాడు.

ఇక్కడివరకైతే బన్నీ ప్లాన్ అంతా బాగానే ఉంది కానీ, సుకుమార్ పేరు ప్రస్తావనకొచ్చిన ప్రతిసారి ఆడియన్స్ కు మైండ్ లో ఏదో కొడుతోంది. ఎందుకంటే చకచకా సినిమాలు చేయడం సుకుమార్ కు రాదు. ఎంచక్కా చెక్కడం మాత్రమే సుకుమార్ కు తెలిసిన విద్య. మరోవైపు బన్నీ మాత్రం శరవేగంగా సినిమా పూర్తిచేయాలంటున్నాడు. ఈసారి వీళ్లిద్దరికి ఎలా సింక్ అవుతుందో చూడాలి. పైగా చాలా గ్యాప్ తర్వాత తిరిగి కలుస్తున్నారు.