దెందులూరులో చింత‌మ‌నేని ఔటేనా !

ప‌శ్చిమగోదావ‌రి జిల్లా…గ‌త ఎన్నిక‌ల్లో టీడీపీ ఔటురేట్‌గా స‌పోర్టు చేసింది. జిల్లాలోని 15 సీట్లు టీడీపీ గెలుచుకుంది. అయితే ఈ జిల్లాలో ఈ సారి అలాంటి ప‌రిస్థితి లేద‌ని తెలుస్తోంది. ఈ సారి ఇక్క‌డ వైసీపీ జెండా ఎగర‌డం ఖాయ‌మ‌ని తెలుస్తోంది. అయితే ఈ జిల్లాలోని హాట్ సీట్‌లో దెందులూరు ఒక‌టి. ఇక్క‌డ హ్యాట్రిక్ మీద క‌న్నేసిన చింత‌మ‌నేనికి ఓట‌మి ఖాయ‌మ‌ని విశ్లేష‌ణ‌లు వెలువ‌డుతున్నాయి.

గ‌త ఎన్నిక‌ల్లో దెందులూరు నుంచి చింత‌మ‌నేని 17 వేల ఓట్ల తేడాతో గెలుపొందారు. 2014లో చింత‌మ‌నేనిపై వైసీపీ అభ్య‌ర్థిగా నాన్‌లోక‌ల్ కారుమూరి నాగేశ్వ‌ర‌రావు పోటీ చేశారు. ఆయ‌న 2009లో త‌ణుకు ఎమ్మెల్యే. నాన్ లోక‌ల్ కావ‌డం…లాస్ట్‌మినిట్‌లో వైసీపీలో చేరి అభ్య‌ర్థిగా నిల‌వ‌డంతో కారుమూరికి ఈ నియోజ‌క‌వ‌ర్గంలో ప‌ట్టు దొర‌క‌లేదు. మ‌రోవైపు ఆయ‌న బీసీ కావ‌డంతో…. ఒక సామాజిక‌వ‌ర్గం పూర్తిగా ఆయ‌న‌కు స‌హ‌క‌రించలేదు.

అయితే ఈ ఎన్నిక‌ల్లో ప‌రిస్థితులు పూర్తిగా మారిన‌ట్లు తెలుస్తోంది. ఈ సారి వైసీపీ అభ్య‌ర్థి అబ్బాయ్ చౌద‌రి లోక‌ల్. అంతేకాకుండా చింత‌మ‌నేని సామాజిక‌వ‌ర్గం. ఏడాదిగా నియోజ‌క‌వ‌ర్గంపై ప‌ట్టు సాధించారు. అంతేకాకుండా త‌న సామాజిక‌వ‌ర్గం మ‌ద్దతు కూడా సాధించారు. ఎన్నిక‌ల ముందు టీడీపీలోని సీనియ‌ర్ నేత‌లు పార్టీ వీడి వైసీపీలో చేర‌డం కూడా ఈయ‌న‌కు క‌లిసొచ్చిన‌ట్లు తెలుస్తోంది.

గ‌త ఎన్నిక‌ల్లో టీడీపీకి వ‌న్‌సైడ్‌గా నిలిచిన గ్రామాలు…ఇప్పుడు వైసీపీ వైపు నిలిచిన‌ట్లు తెలుస్తోంది. అన్ని గ్రామాల్లో టీడీపీ ఆధిక్య‌త‌కు గండికొట్టిన‌ట్లు ఇక్క‌డి వైసీపీ నేత‌లు లెక్క‌లు వేస్తున్నారు. నియోజ‌క‌ వ‌ర్గంలోని నాలుగు మండ‌లాల్లో వైసీపీ స్ప‌ష్టమైన ఆధిక్య‌త సాధించింద‌ని…..సుమారు ఏడు వేల మెజార్టీతో అబ్బాయ్ చౌద‌రి గెలుస్తార‌ని వైసీపీ నేతలు ధీమా వ్య‌క్తం చేస్తున్నారు.

ఇటు టీడీపీ నేత‌లు కూడా ఈ సారి తాము గెలిచేది క‌ష్ట‌మైన‌ని అంటున్నారు. త‌మకు ఈ సారి కొన్ని వ‌ర్గాలు దూరం అయ్యాయ‌ని అంగీక‌రిస్తున్నారు. మొత్తానికి దెందులూరులో చింత‌మ‌నేనికి చెక్ ప‌డిన‌ట్లేన‌ని….ఈ నియోజ‌క‌ వ‌ర్గ ఫ‌లితం ప‌క్క‌నే ఉండే ఏలూరుపై కూడా ప‌డుతుంద‌ని అంటున్నారు.