స‌త్తెన‌ప‌ల్లి టీడీపీలో కొత్త టాక్…. కోడెల ఇంత ప‌నిచేశాడా?

ఎన్నిక‌ల ముందు స‌త్తెన‌ప‌ల్లి టికెట్ వివాదం టీడీపీలో ఓ హైవోల్టేజ్ క్రియేట్ చేసింది. కోడెల శివ‌ప్ర‌సాద‌ రావు కుటుంబంపై వ్య‌తిరేక‌త ఓ రేంజ్‌లో ఉంది. ఈవిష‌యాన్ని ప‌సిగ‌ట్టిన టీడీపీ అధిష్టానం…. ఆయ‌న సీటు మార్చాల‌ని ప్ర‌య‌త్నించింది. దీంతో కోడెల తాను నియోజక‌ వ‌ర్గంలో ప‌రిస్థితులు స‌ర్దుబాటు చేస్తాన‌ని టికెట్ తెచ్చుకున్నారు.

అయితే ఆయ‌న‌కు టికెట్ ఇవ్వొద్దని కొంద‌రు టీడీపీ నేత‌లు ధర్నాలు చేశారు. అయితే ఆయ‌న‌కు టికెట్ రావ‌డం, పోటీచేయ‌డం… ప్ర‌జా వ్య‌తిరేక‌త‌ను ఓ లెవ‌ల్లో ఆయ‌న్ని తాక‌డం మ‌నం చూశాం.

అయితే స‌త్తెన‌ప‌ల్లి ఎమ్మెల్యే టికెట్‌పై రాయ‌పాటి ఫ్యామిలీ క‌న్ను కూడా ప‌డింది. త‌న కొడుకు శ్రీనివాస్‌ను ఇక్క‌డి నుంచి పోటీ చేయించాల‌ని రాయ‌పాటి సాంబ‌శివ‌రావు తీవ్ర ప్ర‌య‌త్నాలు చేశారు.

అయితే కోడెల ఎత్తుల ముందు రాయ‌పాటి ప్లాన్‌లు ఫలించ‌లేదు. ఆయ‌న న‌ర‌స‌రావు పేట నుంచి ఎంపీగా పోటీ చేయాల్సి వ‌చ్చింది. అయితే త‌న‌కు వ్య‌తిరేకంగా నియోజ‌క‌వ‌ర్గంలో నిర‌స‌న‌లు చెల‌రేగడానికి రాయ‌పాటియే కార‌ణ‌మ‌ని కోపం పెంచుకున్న కోడెల‌…. పోలింగ్‌కు ముందు రాయ‌పాటికి వ్య‌తిరేకంగా పావులు క‌దిపిన‌ట్లు ఇప్పుడు తెలుస్తోంది.

న‌ర‌స‌రావుపేట ఎంపీగా రాయ‌పాటికి ఓటు వేయొద్ద‌ని టీడీపీలోని త‌న వ‌ర్గానికి కోడెల చెప్పార‌ట‌. అందులో భాగంగా ఎమ్మెల్యేగా కోడెల‌కు ఓటు వేసిన టీడీపీ బ్యాచ్‌….ఎంపీగా మాత్రం వైసీపీ అభ్య‌ర్థి కృష్ణ‌దేవ‌రాయుల‌కే ఓటు వేశార‌ని ఇప్పుడు గుస‌గుస‌లు విన్పిస్తున్నాయి. రాయ‌పాటిపై కోపంతోనే కోడెల ఇలా చేసిన‌ట్లు ఇప్పుడు స‌త్తెన‌ప‌ల్లి జ‌నాలు చెబుతున్నారు.

మరోవైపు రాయ‌పాటి కూడా ప్రచారంలో భాగంగా స‌త్తెన‌ప‌ల్లి వైపు క‌న్నెత్తి కూడా చూడ‌లేదు. క‌నీసం పార్టీ త‌ర‌పున ప్రచారంలో పాల్గొన‌లేదు. మొత్తానికి కోడెల, రాయ‌పాటి మ‌ధ్య పోరులో ఎన్నిక‌ల త‌ర్వాత ఎలాంటి ట‌ర్న్‌లు తీసుకుంటాయో చూడాలి.