వాళ్లు పెదవి విప్పరు…. వీళ్లు పెదవి మూయరు…. ఇది “దేశం” ఓటమి సంకేతమా ?

ఎన్నికలు పూర్తి అయ్యాయి. ఓటర్లు ఇచ్చిన తీర్పు ఈవీఎంల్లో నిక్షిప్తమై ఉంది. మరో 40 రోజుల వరకూ విజయం కోసం రాజకీయ పార్టీల నాయకులతో పాటు ప్రజలు కూడా వేచి చూడాల్సిన పరిస్థితి.

అయితే, ఇక్కడే ఓ అంశం అటు రాజకీయ పక్షాల వారినీ, ఇటు రాజకీయ  విశ్లేషకులను, ముఖ్యంగా తెలుగు ప్రజలను ఆలోచనలో పడేస్తోంది. అదే ఏమిటనుకుంటున్నారా..? ఎన్నికల్లో తప్పనిసరిగా విజయం సాధిస్తామని చెబుతున్న తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు, ఆయన పార్టీలోని సీనియర్ నాయకులు చీటికీ మాటికీ ఈవీఎంలు సరిగా పని చేయలేదని ఎందుకు విమర్శిస్తున్నారని అంటున్నారు.

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో విజయం తమదే అని పదే పదే చెబుతున్న తెలుగుదేశం నాయకులు ఎక్కడ పడితే అక్కడ విలేకరుల సమావేశాలు ఏర్పాటు చేసి ఈవీఎంలపై సందేహాలు వ్యక్తం చేయడం అందరికీ అనుమానాలను రేకెత్తిస్తున్నాయి. ఎన్నికల్లో విజయం తమదే అయితే తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడితో పాటు ఇతర నాయకులు ప్రతీ రోజు అనుమానాలు ఎందుకు వ్యక్తం చేస్తున్నారని ప్రశ్నిస్తున్నారు.

తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు అయితే ఏకంగా ఢిల్లీ వెళ్లి ఎన్నికల కమిషన్ ను కలిసి తన అభ్యంతరాలను వ్యక్తం చేశారు. అంతే కాదు…. కొందరు జాతీయ నాయకులతో కలిసి ఈవీఎంల పనితీరుపై ఓ సమావేశాన్ని కూడా ఏర్పాటు చేశారు.

విజయం తమదే అని ఒకవైపు చెబుతున్న చంద్రబాబు నాయుడు ఇవన్నీ ఎందుకు చేస్తున్నారని ప్రశ్నిస్తున్నారు. విజయావకాశాలపై ధీమా తగ్గడం, ఆంధ్రప్రదేశ్ నిఘా విభాగం నుంచి వచ్చిన నివేదికల ఆధారంగా తెలుగుదేశం పార్టీ ఓటమి పాలవుతుందని తెలుసుకున్న చంద్రబాబు నాయుడు, ఆయన పార్టీ నాయకులు ఇలా నోరు చేసుకుంటున్నారని అంటున్నారు.

మరోవైపు ఆంధ్రప్రదేశ్ లో ప్రతిపక్ష వై.ఎస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి ఎన్నికలు ముగిసిన రోజునే విలేకరులతో మాట్లాడారు. ఆ తర్వాత ఆయన కాని, ఆ పార్టీకి చెందిన వారు కాని పెద్దగా స్పందించిన దాఖలాలు లేవు. అలాగే ఆ పార్టీ నాయకులెవ్వరూ ఈవీఎంలపై కనీసం ఒక్క మాట కూడా మాట్లాడకపోవడవం వారి విజయానికి సంకేతమని అంటున్నారు.

గత ఎన్నికల్లో తనకు విజయం తీసుకువచ్చిన ఈవీఎంలు ఈసారి మాత్రం సరిగా పని చేయడం లేదని చంద్రబాబు నాయుడు ఆరోపించడం వెనుక ఆయన ఓటమి భయమే కారణమని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. తెలుగుదేశం నాయకులు ఎంత విమర్శించినా… జగన్మోహన్ రెడ్డి కాని, ఆయన పార్టీ వారు కాని పెదవి విప్పకపోవడం వారి నైతిక విజయమని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.