పెళ్లిపై మరోసారి స్పందించిన రేణుదేశాయ్

ఆమధ్య పెళ్లి చేసుకుంటానని ప్రకటించింది రేణుదేశాయ్. అప్పట్నుంచి ఈమెపై సోషల్ మీడియాలో ట్రోలింగ్ నడుస్తూనే ఉంది. పవన్ మాజీ భార్య హోదాలో ఎలా పెళ్లి చేసుకుంటావంటూ పవన్ అభిమానులు ఆమెపై విరుచుకుపడ్డారు.

అయినప్పటికీ రేణుదేశాయ్ వెనక్కి తగ్గలేదు. తనకు మరో పెళ్లి చేసుకునే హక్కు ఉందని తెలిపిన ఆమె, చెప్పినట్టుగానే ఓ వ్యక్తితో నిశ్చితార్థం కూడా చేసుకుంది. నిశ్చితార్థానికి సంబంధించిన ఫొటోను కూడా షేర్ చేసింది. తాజాగా ఇప్పుడు మరోసారి తన పెళ్లిపై స్పందించింది రేణుదేశాయ్.

అలీ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న ఓ టీవీ కార్యక్రమానికి ప్రత్యేక అతిథిగా హాజరైంది రేణుదేశాయ్. ఈ సందర్భంగా రెండో పెళ్లికి సంబంధించి అలీ అడిగిన ప్రశ్నకు సూటిగా సమాధానం ఇచ్చింది. ఆల్రెడీ నిశ్చితార్థం అయిపోయిందని, ఎంతమంది ఎన్ని విధాలుగా ట్రోలింగ్ చేసినప్పటికీ తన పెళ్లి జరిగి తీరుతుందని స్పష్టంచేసింది. తన జీవితానికి సంబంధించి నిర్ణయం తీసుకునే హక్కు తనకు ఉందని స్పష్టంచేసింది.

తొలిసారిగా తనకు కాబోయే భర్తకు సంబంధించిన వివరాల్ని కూడా రేణు వెల్లడించింది. పూణెలోని ఓ సాఫ్ట్ వేర్ కంపెనీలో అతడు డైరక్టర్ హోదాలో ఉన్నాడని స్పష్టంచేసింది. చాన్నాళ్లు అతడు అమెరికాలోనే ఉన్నాడని, తండ్రి ఆరోగ్యం సరిగ్గా లేకపోవడంతో పూణెకు షిఫ్ట్ అయ్యాడని తెలిపింది. కాబోయే భర్త పేరు వెల్లడించడానికి మాత్రం రేణుదేశాయ్ ఇష్టపడలేదు.