Telugu Global
NEWS

పవన్ చెప్పినా.... ఓటర్ నమ్మలేదా?

పవర్ స్టార్ పవన్ కల్యాణ్…. జనసేన పేరుతో రాజకీయ పార్టీ ఏర్పాటు చేసి ఎన్నికల క్షేత్రంలోకి దూకిన హీరో. గత ఎన్నికలలో తెలుగుదేశం పార్టీకి మద్దతు పలికి తాను తప్పు చేశానంటూ సరికొత్త ప్రచారంతో ఎన్నికల బరిలో నిలిచారు. ఈ ప్రచారం తెలుగు తమ్ముళ్లను సైతం భయపడేలా చేసింది. ఎన్నికలు ఇరవై రోజులున్నాయనగా పవన్ కల్యాణ్ ప్రభావంతో తాము ఓటమి పాలవుతామని తెలుగుదేశం అభ్యర్ధులు కంగారు పడ్డారు. అయితే, ఇరవై రోజుల తర్వాత మాత్రం పవన్ కల్యాణ్ తన ప్రచారాన్ని […]

పవన్ చెప్పినా.... ఓటర్ నమ్మలేదా?
X

పవర్ స్టార్ పవన్ కల్యాణ్…. జనసేన పేరుతో రాజకీయ పార్టీ ఏర్పాటు చేసి ఎన్నికల క్షేత్రంలోకి దూకిన హీరో. గత ఎన్నికలలో తెలుగుదేశం పార్టీకి మద్దతు పలికి తాను తప్పు చేశానంటూ సరికొత్త ప్రచారంతో ఎన్నికల బరిలో నిలిచారు. ఈ ప్రచారం తెలుగు తమ్ముళ్లను సైతం భయపడేలా చేసింది. ఎన్నికలు ఇరవై రోజులున్నాయనగా పవన్ కల్యాణ్ ప్రభావంతో తాము ఓటమి పాలవుతామని తెలుగుదేశం అభ్యర్ధులు కంగారు పడ్డారు. అయితే, ఇరవై రోజుల తర్వాత మాత్రం పవన్ కల్యాణ్ తన ప్రచారాన్ని మార్చేశారు.

ఏం జరిగిందో… ఎందుకు జరిగిందో… ఎలా జరిగిందో ఎవరికీ అర్ధం కాలేదు కాని… పవన్ కల్యాణ్ తన ప్రచారంలో అధికార తెలుగుదేశం పార్టీని విమర్శించడం మానేశారు. ఆ స్ధానంలో ప్రతిపక్ష వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ పార్టీని విమర్శించడం ప్రారంభించారు. జగన్ అధికారంలోకి రావడానికి వీల్లేదంటూ ప్రచారం ప్రారంభించాడు. ఇది అటు రాజకీయ పార్టీలను, ఇటు ప్రజలను కూడా అయోమయానికి గురి చేసింది.

ఈ హఠాత్ ప్రచార సరళితో తెలుగుదేశం పార్టీకి చెందిన అభ్యర్ధులు ఆనంద డోలికల్లో తేలియాడారు. పవన్ కల్యాణ్ చేస్తున్న విమర్శల కారణంగా వై.ఎస్.ఆర్ కాంగ్రెస్ పార్టీకి తీవ్ర నష్టం జరుగుతుందని ఆశించారు. ఆ ఆశలతోనే ఎన్నికల్లో తమ విజయం ఖాయమని ధీమాగా ఉన్నారు.

తీరా ఎన్నికలు ముగిసిన తర్వాత ఒక్కొక్క రోజు ఒక్కో విషయం వెలుగులోకి వస్తూండడంతో తెలుగు తమ్ముళ్లకు ఉన్న భరోసా కాస్తా సన్నగిల్లుతుందంటున్నారు.

తాజాగా తెలుగుదేశం పార్టీ అభ్యర్ధులకు అందిన సమాచారం మేరకు పవన్ కల్యాణ్ వై.ఎస్.ఆర్ కాంగ్రెస్ పార్టీపై చేసిన విమర్శల ప్రభావం ఆ పార్టీకి ఎలాంటి నష్టం కలిగించలేదని తమ్ముళ్లే తమ వారి వద్ద చెబుతున్నట్లు సమాచారం.

తెలుగుదేశం పార్టీని తీవ్రంగా విమర్శించిన పవన్ కల్యాణ్ హఠాత్తుగా తన రూటు మార్చడంపై ప్రజల్లో అనుమానాలు వచ్చాయని, పవన్ కల్యాణ్ గతంలోలా డైరెక్ట్ గా కాకుండా…. ఈ సారి “లోపాయకారి” స్నేహ హస్తం ఇచ్చారని ప్రజలు భావించినట్లుగా చెబుతున్నారు.

ఇలా తెలుగుదేశం పార్టీతో హఠాత్తు స్నేహానికి కారణాలపై కూడా ఆంధ్రప్రదేశ్ ఓటర్లు వివిధ రకాలుగా చర్చించుకున్నారని, లోలోపల ఏదో జరగబట్టే పవన్ తన రూట్ మార్చేశారనే అనుమానం వచ్చిందని తెలుగు తమ్ముళ్లు చెబుతున్నారు. ముఖ్యంగా చంద్రబాబు నాయుడిపై తీవ్ర అసహనం, ఆగ్రహంగా ఉన్న కాపు సామాజిక వర్గం యువత పవన్ కల్యాణ్ యూటర్న్ తీసుకోవడాన్ని జీర్ణించుకోలేకపోయారని అంటున్నారు. పవన్ కల్యాణ్ చేసిన ప్రచారం ఆయనకే బూమ్ రాంగ్ అయ్యిందని, దీని కారణంగా తెలుగుదేశం పార్టీకి తీవ్ర నష్టం జరిగిందని అంచనా వేస్తున్నారు.

గతంలో ఓటర్లు సినీ హీరోల మాటలకు విలువ ఇచ్చేవారని, ఇప్పుడు ఆ పరిస్థితి మారిందని తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు చెబుతున్నారు. పవన్ కల్యాణ్ చేసిన విమర్శలను ప్రజలు నమ్మలేదని, ఆయన మాటలను వారు నమ్మినట్లుగా కనిపించడం లేదని వారంటున్నారు. ఇదే వాస్తవమైతే వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ పార్టీకి ఘనవిజయం తథ్యమని అంచనా వేస్తున్నారు.

First Published:  16 April 2019 10:15 PM GMT
Next Story