విజయశాంతి చేయాల్సిన పాత్ర ఈమె చేస్తోందట!

ఈ మధ్యనే శ్రీ విష్ణు హీరోగా నటించిన ‘నీది నాది ఒకే కథ’ సినిమాతో మంచి పేరు తెచ్చుకున్న దర్శకుడు వేణు ఊడుగుల ఇప్పుడు రానా దగ్గుబాటి తో కలిసి ‘విరాటపర్వం 1992’ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.

1992 బ్యాక్ డ్రాప్ తో థ్రిల్లర్ గా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమా లో ‘ఫిదా’ బ్యూటీ సాయి పల్లవి హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమాలో టబు ఒక ముఖ్య పాత్ర పోషిస్తున్నట్లు వార్తలు బయటకు వస్తున్నాయి. అయితే నిజానికి ఈ పాత్ర వేరొకరు చేయాల్సి ఉందట.

తాజా సమాచారం ప్రకారం టబు చేయాల్సిన పాత్ర ఇంతకుముందు విజయశాంతి చేయాల్సిందట. ఆ పాత్ర కోసం సంప్రదించగా విజయశాంతి మొదట ఒప్పుకుందని కానీ తరువాత అడిగిన డేట్లు కేటాయించ లేకపోవడం వలన సినిమా నుంచి తప్పుకుందని తెలుస్తోంది.

అప్పుడు ఈ పాత్ర కోసం టబు ని సంప్రదించగా ఆమె గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందట. తెలుగులో 2008 లో ‘పాండురంగడు’ సినిమాలో కనిపించిన ఈమె గత కొంత కాలంగా బాలీవుడ్ లో బిజీగా ఉంది. గతేడాది ‘అంధాధున్’ సినిమాతో సూపర్ హిట్ అందుకున్న టబు ఇప్పుడు బన్నీ-త్రివిక్రమ్ సినిమాలో కూడా ముఖ్య పాత్ర పోషిస్తున్నట్లు తెలుస్తోంది.