ఇంత చెత్త స్పీకర్‌ చరిత్రలో లేడు….

చంద్రబాబుని ఎవరితో పోల్చినా వాళ్ళను అవమానించినట్టేనన్నారు వైసీపీ నేత సీ. రామచంద్రయ్య. నిన్న కోడెల మీడియాతో మాట్లాడిన తీరుపై మండిపడ్డారు ఆయన. చంద్రబాబును జగన్‌తో పోల్చడం ఏమిటి? అని నిన్న మీడియాని ప్రశ్నించాడు కోడెల. దీనిపై స్పందించిన సీ. రామచంద్రయ్య…. కోడెల చెప్పింది నిజమేనని… అయితే చంద్రబాబుని ఎవరితో పోల్చినా అది చంద్రబాబుకు అవమానం కాదని, పోల్చిన వాళ్ళను అవమానించినట్టేనన్నారు.

స్పీకర్‌ ఔన్నత్యాన్ని కోడెల మంటగలిపారని… కోడెల శాసనసభను జరిపిన తీరు ఒక చీకటి అధ్యాయమని… కంచే చేనుమేసిన చందంగా కోడెల వ్యవహారం ఉందన్నారు. అసెంబ్లీలో కోడెల దుష్టసాంప్రదాయానికి నాంది పలికారని… అసెంబ్లీలో కార్యక్రమాలన్నీ టీడీపీ కార్యక్రమాలుగా మార్చేసి…. ప్రతిపక్షం నోరు నొక్కేశారన్నారు. రాష్ట్ర రాజకీయాల్లోనే కోడెల ఒక వివాదాస్పద రాజకీయ నాయకుడన్నారు.

పార్లమెంట్ లో స్పీకర్లను చూశాము, దేశంలో అనేక రాష్ట్రాల్లో గొప్ప స్పీకర్లను చూశాము కానీ ఇలాంటి చెత్త స్పీకర్‌ను చూడలేదని మండిపడ్డారు రామచంద్రయ్య. ఫిరాయింపు ఎమ్మెల్యేల మీద చర్యలు తీసుకోకుండా ఏకపక్షంగా వ్యవహరించారని…. సభలో న్యాయం జరగలేదు కాబట్టే… వైఎస్‌ జగన్‌ అసెంబ్లీనీ బహిష్కరించి ప్రజల దగ్గరకు వెళ్ళారని గుర్తుచేశారు. ఎమ్మెల్యే రోజాను నిబంధనలకు విరుద్దంగా సభ నుంచి ఏడాది సస్పెండ్‌ చేసింది నిజం కాదా అని ప్రశ్నించారు.

గౌరవప్రదమైన స్పీకర్‌ స్థానంలో ఉంటూ కోడెల టీడీపీ కార్యక్రమాల్లో పాల్గొన్నారన్నారు. కోడెల సొంత నియోజకవర్గం నుంచి ఎందుకు పోటీ చేయలేదని ప్రశ్నించారు.

కోడెల తన చరిత్ర ఏంటో తెలుసుకుని మాట్లాడాలని సూచించారు సీ. రామచంద్రయ్య. గతంలో కోడెల ఇంట్లో బాంబులు పేలాయని… చంద్రబాబు సహాయంతో ఆ కేసుల నుంచి బయటపడి, ఇప్పుడు కోడెల నీతులు చెప్పడం చూస్తుంటే దయ్యాలు వేదాలు చెబుతున్నట్లుగా ఉందన్నారు. ప్రాణహాని ఉందని రంగా భద్రత కోరితే హోంమంత్రిగా ఉన్న కోడెల అప్పుడు ఏం చేశారని ప్రశ్నించారు.

ప్రజాస్వామ్యం గురించి మాట్లాడే అర్హత కోడెల కోల్పోయారని, అధికారం శాశ్వతం కాదని తెలుసుకోవాలన్నారు. కోడెల బెదిరింపులకు ఎవరూ భయపడరని, కోడెల అరాచకాలను రాష్ట్రంలో ఎవరిని అడిగినా చెప్తారన్నారు.

దేశచరిత్రలో ఇందిరాగాంధీ, ఎన్టీఆర్‌ లాంటి వారినే ఓటించారని గుర్తుచేశారు. స్పీకర్‌ పదవికి కళంకం తెచ్చిన అప్రజాస్వామిక వాది కోడెల అని మండిపడ్డారు. కోడెల రాజకీయంగా అత్యంత వివాదాస్పదమైన వ్యక్తి అని, సత్తెనపల్లిలో కోడెల కుటుంబసభ్యుల అరాచాలకు హద్దేలేదన్నారు. ఈ ఐదేళ్ళలో సత్తెనపల్లిలో అసలేం అభివృద్ధి జరిగింది? దీనిపై సమాధానం చెప్పాలన్నారు.

ఈసీ తనిఖీల్లో బయటపడిన బంగారానికి పత్రాలు లేవని, వాటికి సమాధానం చెప్పాలన్నారు. చంద్రబాబు హయాంలో ఘోరమైన పాలన జరిగిందని, తన అవినీతి బయటపడుతుందని చంద్రబాబు భయపడుతున్నారన్నారు అందుకే ఇలా రోజుగో విధంగా వ్యవహరిస్తున్నాడన్నారు.

పోలవరం ఎందుకు ఇంత ఆలస్యమైందని, కేంద్రం నుంచి ప్రాజెక్టును లాక్కుని ఏం చేశారని ప్రశ్నించారు. ప్రజలకు ఉపయోగపడే పనులు చేయకుండా… ప్రతిదీ డబ్బుకోసమే చంద్రబాబు ఈ ఐదేళ్ళు పనిచేశారన్నారు.