ఐపీఎల్ బిగ్ ఫైట్ కు ఢిల్లీ కోట్లా స్టేడియం రెడీ

  • రాత్రి 8 గంటలకు ఢిల్లీ క్యాపిటల్స్ కు ముంబై ఇండియన్స్ సవాల్ 
  • లో స్కోరింగ్ ఫైట్ లో నువ్వానేనా అంటున్న ముంబై, ఢిల్లీ
  • ఇటు రబాడా, రిషభ్ పంత్…అటు బుమ్రా, మలింగ, రోహిత్

ఐపీఎల్ తొమ్మిదోరౌండ్లో అతిపెద్ద సమరానికి…మాజీ చాంపియన్ ముంబై ఇండియన్స్, ఢిల్లీ క్యాపిటల్స్ సై అంటే సై అంటున్నాయి.

న్యూఢిల్లీ ఫిరోజ్ షా కోట్లా…మందకొడి పిచ్ పై రాత్రి 8 గంటలకు ప్రారంభమయ్యే..ఈ పోటీలో విజయమేలక్ష్యంగా రెండుజట్లు బరిలోకి దిగుతున్నాయి.

ప్రస్తుత సీజన్ తొలి అంచె పోటీలో ముంబైని 37 పరుగులతో కంగు తినిపించిన ఢిల్లీ క్యాపిటల్స్…హోంగ్రౌండ్లో సైతం విజయం తనదేనన్న ధీమాతో ఉంది.

సమానబలం కలిగిన ఈ రెండుజట్ల మధ్య జరిగే ఈ పోటీ ఆసక్తికరంగా సాగే అవకాశం ఉంది. మెరుపు ఫాస్ట్ బౌలర్ రబాడా, సూపర్ హిట్టర్ రిషభ్ పంత్ లాంటి ఆటగాళ్లతో…ఢిల్లీ విజయానికి ఉరకలేస్తుంటే… మరోవైపు రోహిత్ శర్మ నాయకత్వంలోని ముంబై ఇండియన్స్ సైతం దెబ్బకు దెబ్బ తీయాలన్న పట్టుదలతో ఉంది.

ఢిల్లీదే పైచేయి…

ఈ రెండుజట్లు ఇప్పటి వరకూ 23 సార్లు తలపడితే..ఢిల్లీ క్యాపిటల్స్ 12 విజయాలు, ముంబై 11 విజయాల రికార్డుతో ఉన్నాయి.

ఇప్పటి వరకూ జరిగిన మొదటి ఎనిమిది రౌండ్ల పోటీల్లో ఈ రెండుజట్లూ చెరో ఐదు విజయాలతో…10 పాయింట్లు చొప్పున సాధించి…లీగ్ టేబుల్ రెండు, మూడుస్థానాలలో కొనసాగుతున్నాయి.