అన్ని జీవోలు ఎందుకు జారీ చేశారు?…. బాబు పై బొత్స సంచలన ఆరోపణ

చంద్రబాబుకు పదవీ వ్యామోహం పోలేదన్నారు బొత్స సత్యనారాయణ. చంద్రబాబు ఇంకా అధికార భ్రమలోనే ఉన్నారన్నారు. వ్యవవస్థలన్నీ తన చెప్పు చేతల్లోనే ఉండాలనుకుంటున్నారని, చివరకు ఎన్నికల సంఘం కూడా తన చెప్పు చేతల్లో ఉండాలనుకుంటున్నారని మండిపడ్డారు.

ఎన్నికల కోడ్‌ అమల్లో ఉన్నా అధికారులతో సమీక్షలేంటని ప్రశ్నించారు.  కోడ్‌ అమల్లో ఉండగా అధికారిక కార్యక్రమాల్లో పాల్గొనరాదని… కానీ పాత బకాయిల కోసమే చంద్రబాబు ఈ సమీక్షలు నిర్వహిస్తున్నారన్నారు. అవినీతి కార్యక్రమాలను చక్కబెట్టే పనిలో చంద్రబాబు ఉన్నారన్నారు.

వ్యవస్థలకు అతీతుడన్నట్టుగా చంద్రబాబు వ్యవహరిస్తున్నారన్నారు.

కోడ్‌ ఉల్లంఘించారనే సీఎస్‌ పై ఈసీ చర్యలు తీసుకుందని… దాన్ని ఎందుకు అంత రాదాంతం చేస్తున్నారన్నారు. ఏపీ ఇంటెలిజెన్స్‌ ప్రతిపక్ష పార్టీ నేతల ఫోన్‌లను ట్యాప్‌ చేసిందని….. పోలీస్‌ వ్యవస్థను చంద్రబాబు భ్రష్టు పట్టించారని మండిపడ్డారు.

రాష్ట్ర ప్రజల విశ్వాసాన్ని చంద్రబాబు కోల్పోయారని, ప్రజలు మార్పు కోరుకుంటున్నారన్నారు. చంద్రబాబు చేసే కుట్రలను ప్రజలు సహించరని, ఇప్పటికైనా కుట్రలు ఆపకుంటే ప్రజలు బాబును తరిమి కొడతారన్నారు.

ఎన్నికల నోటిఫికేషన్‌ వచ్చిన తర్వాత చంద్రబాబు 18 కాన్ఫిడెన్షియల్‌ జీవోలు జారీ చేశారని సంచలన విషయం బయట పెట్టారు బొత్స. అలా జీవోలు జారీ చేయాల్సిన అవసరం ఏమొచ్చిందని ప్రశ్నించారు.

ఐటీ గ్రిడ్స్‌ సంస్థ వెనుక పెద్ద కుట్ర ఉందని తాము ముందే చెప్పామన్నారు బొత్స.

టీడీపీ శకం అంతమైందని… త్వరలో ప్రజా ప్రభుత్వం, రాజన్న రాజ్యం రాబోతోందన్నారు బొత్స సత్యనారాయణ.