38 ఏళ్ల వయసులోనే స్కాట్లాండ్ ఆల్ రౌండర్ మృతి

  • బ్రెయిన్ ట్యూమర్ తో తుదివరకూ పోరాడిన కాన్ డీ లాంగే
  • స్కాట్లాండ్ తరుపున 21 వన్డేలు ఆడిన డీ లాంగే

క్రికెట్ ఫీల్డ్ లో ఎన్నో పోరాటాలు చేసిన స్కాట్లాండ్ ఆల్ రౌండర్ కాన్ డీ లాంగే….మృత్యువుతో జరిపిన పోరాటంలో మాత్రం సఫలం కాలేకపోయాడు. కేవలం 38 ఏళ్ల చిరుప్రాయంలోనే కన్ను మూశాడు.

దక్షిణాఫ్రికా గడ్డపై జన్మించి..స్కాట్లాండ్ జాతీయుడుగా క్రికెట్ ఆడుతున్న కాన్ డీ లాంగే…లెఫ్టామ్ స్పిన్ ఆల్ రౌండర్ గా పేరుంది. స్కాట్లాండ్ జాతీయజట్టులో సభ్యుడిగా వన్డే అరంగేట్రం చేసిన డీ లాంగేకు…మొత్తం 21 అంతర్జాతీయ మ్యాచ్ లు ఆడిన రికార్డు ఉంది.

అంతేకాదు…జింబాబ్వే ప్రత్యర్థిగా స్కాట్లాండ్ సాధించిన ఒకే ఒక్క సంచలన విజయంలో డీ లాంగే ప్రధానపాత్ర వహించాడు. 60 పరుగులకే 5 వికెట్లు పడగొట్టి… తనజట్టుకు చిరస్మరణీయ విజయం అందించాడు.

ఆ తర్వాత మరో ఐదు అంతర్జాతీయ మ్యాచ్ లు మాత్రమే ఆడిన డీ లాంగే కు బ్రెయిన్ ట్యూమర్ ఉన్నట్లు వైద్యపరీక్షల్లో తేలింది. ఆరోగ్యకారణాలతో అప్పటి నుండి క్రికెట్ కు దూరమయ్యాడు. చికిత్స కోసం దేశవ్యాప్తంగా భారీగా నిధులు సేకరించారు.

2017 సీజన్ నుంచి క్రికెట్ కు దూరమై…అనారోగ్యంతో పోరాడుతూ వచ్చిన డీ లాంగే కొద్దిగంటల క్రితమే మృతి చెందినట్లు క్రికెట్ స్కాట్లాండ్ అధికారికంగా ప్రకటించింది. 38 ఏళ్ల డీ లాంగేకి…భార్య క్లారీ, పిల్లలు డైసీ, రోరీ ఉన్నారు.

ప్రతిభావంతుడైన ఓ క్రికెటర్ చిన్నవయసులోనే మృతి చెందటం తమకు తీరని లోటని స్కాట్లాండ్ క్రికెట్ సంఘం తన సంతాప సందేశంలో ప్రకటించింది.