ఇంకా రికార్డుల మోత మోగిస్తున్న ‘ఎఫ్ 2’ సినిమా

F2 movie

మల్టీ స్టారర్ ట్రెండు బాగా నడుస్తున్న సమయంలో సీనియర్ హీరో విక్టరీ వెంకటేష్ మరియు మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ కలిసి ‘ఎఫ్ 2: ఫన్ అండ్ ఫ్రస్ట్రేషన్’ అనే ఒక మల్టి స్టారర్ చిత్రంలో కలిసి నటించిన సంగతి తెలిసిందే.

హ్యాట్రిక్ దర్శకుడు అనిల్ రావిపూడి దర్శకత్వంలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా లో తమన్నా, మెహరీన్ పిర్జాదా హీరోయిన్లుగా నటించారు. భారీ అంచనాల మధ్య ఈ చిత్రం సంక్రాంతి కానుకగా విడుదలైంది.

అంతేకాక సంక్రాంతికి విడుదలైన అన్ని చిత్రాలకు గట్టిపోటీ ఇచ్చి ‘ఎఫ్ 2’ సినిమా బ్లాక్ బస్టర్ గా నిలిచింది. బాక్స్ ఆఫీసు వద్ద కాసుల వర్షం కురిపించడమే కాకుండా టాలీవుడ్ రికార్డులను సైతం బద్దలు కొట్టింది ఈ సినిమా.

థియేట్రికల్ రన్ పూర్తయినప్పటికీ రికార్డుల మోత మోగిస్తూనే ఉంది. విడుదలైన కొన్ని రోజులకే ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ లో పెట్టేసిన సంగతి తెలిసిందే. అమెజాన్ లో కూడా మంచి వ్యూస్ ను సొంతం చేసుకున్న ఈ చిత్రం ఈ మధ్యనే టీవీలో కూడా ప్రసారమైంది.

అయితే ఈ చిత్రం టీవీ ప్రీమియర్ తో మంచి టిఆర్పీ నమోదు చేసుకుని అందరికీ షాక్ ఇచ్చింది. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా 17.2 టిఆర్పీ నమోదు చేసుకున్నట్లు తెలుస్తోంది. ఒకవైపు అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమ్ అవుతున్నప్పటికీ ఈ సినిమాను చూసేందుకు ప్రేక్షకులు ఆసక్తి చూపిస్తున్నారని చెప్పటానికి ఇదే నిదర్శనం. దిల్ రాజు నిర్మించిన ఈ చిత్రానికి దేవిశ్రీప్రసాద్ సంగీతాన్ని అందించారు.