కోట్లాటలో ఢిల్లీకి ముంబై దెబ్బ

  • 8వేల పరుగుల క్లబ్ లో రోహిత్ శర్మ
  • 150 వికెట్ల అమిత్ మిశ్రా

ఐపీఎల్ మాజీ చాంపియన్ ముంబై ఇండియన్స్ లీగ్ టేబుల్ రెండోస్థానంలో నిలిచింది. న్యూఢిల్లీ ఫిరోజ్ షా కోట్లా స్టేడియం వేదికగా ముగిసిన తొమ్మిదోరౌండ్ మ్యాచ్ లో ముంబై 40 పరుగులతో ఢిల్లీ క్యాపిటల్స్ ను చిత్తు చేసింది.

ఈ కీలక మ్యాచ్ లో టాస్ నెగ్గి ముందుగా బ్యాటింగ్ ఎంచుకొన్న ముంబై 20 ఓవర్లలో 5 వికెట్లకు 168 పరుగులు సాధించింది.

ఆల్ రౌండర్ కృణాల్ పాండ్యా 37 పరుగుల నాటౌట్ తో.. టాప్ స్కోరర్ గా నిలిచాడు. సమాధానంగా 169 పరుగుల టార్గెట్ తో చేజింగ్ కు దిగిన ఢిల్లీ..20ఓవర్లలో 9 వికెట్లకు 128 పరుగులు మాత్రమే చేయగలిగింది.

ముంబై బౌలర్లలో లెగ్ స్పిన్నర్ చహార్ 3 వికెట్లు పడగొట్టాడు. హార్థిక్ పాండ్యాకు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది.
ఈ విజయంతో ముంబై 9రౌండ్లలో 6 విజయాలతో 12 పాయింట్లు సాధించడం ద్వారా…టేబుల్ టాపర్ చెన్నై తర్వాతి స్థానంలో నిలిచింది.

ఎనిమిదో క్రికెటర్ రోహిత్ శర్మ…

ముంబై ఇండియన్స్ డాషింగ్ ఓపెనర్ కమ్ కెప్టెన్ రోహిత్ శర్మ…ధూమ్ ధామ్ టీ-20 ఫార్మాట్లో ఎనిమిదివేల పరుగుల మైలురాయిని చేరాడు.

ఢిల్లీ క్యాపిటల్స్ తో ముగిసిన మ్యాచ్ లో రోహిత్ 22 బాల్స్ లో మూడు బౌండ్రీలు, ఓ సిక్సర్ తో 30 పరుగులు సాధించడం ద్వారా 8వేల పరుగుల రికార్డును పూర్తి చేశాడు.

ఈ ఘనత సాధించిన ఎనిమిదో క్రికెటర్ గా రికార్డుల్లో చేరాడు. టీ-20 క్రికెట్లో అత్యధిక పరుగులు సాధించిన రికార్డు కరీబియన్ ఓపెనర్ క్రిస్ గేల్ పేరుతో ఉంది.

గేల్ 12 వేల 670 పరుగులతో నంబర్ వన్ ఆటగాడిగా ఉన్నాడు. మెకల్లమ్, పోలార్డ్, షోయబ్ మాలిక్, వార్నర్, రైనా, కొహ్లీ
సైతం…రోహిత్ కంటే ముందే 8వేల పరుగులు సాధించగలిగారు.

అమిత్ మిశ్రా అరుదైన రికార్డు

ఢిల్లీ క్యాపిటల్స్ లెగ్ స్పిన్నర్…ఐపీఎల్ లో 150 వికెట్ల మైలురాయిని చేరాడు. ఈ ఘనత సాధించిన రెండోబౌలర్ గా నిలిచాడు.

న్యూఢిల్లీ ఫిరోజ్ షా కోట్లా స్టేడియం వేదికగా ముంబై ఇండియన్స్ తో ముగిసిన మ్యాచ్ లో…ముంబై కెప్టెన్ రోహిత్ శర్మను అవుట్ చేయడం ద్వారా తన ఖాతాలో 150వ వికెట్ ను జమచేసుకొన్నాడు.

ఐపీఎల్ లో మూడు హ్యాట్రిక్ లు సాధించిన ఒకే ఒక్కడుగ నిలిచిన అమిత్ మిశ్రా…ఢిల్లీ డేర్ డెవిల్స్ జట్టులో సభ్యుడిగా 90 వికెట్లు, డెక్కన్ చార్జర్స్ తరపున 32, సన్ రైజర్స్ తరపున 26 వికెట్లు సాధించాడు.