3డి లో భయపెట్టనున్న అంజలి

ఈ మధ్యకాలంలో ‘వేర్ ఇస్ ది వెంకటలక్ష్మి’, ‘ప్రేమకథాచిత్రం’, ‘కాంచన 3’ వంటి చాలానే హారర్ కామెడీ సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. కానీ అసలు సిసలైన హారర్ సినిమా తెలుగులో వచ్చి చాలా కాలమైంది. ఇప్పుడు సౌత్ బ్యూటీ అంజలి ‘లిసా’ అనే సినిమాతో త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. రాజు విశ్వనాథ్ దర్శకత్వం వహించిన ఈ సినిమా తెలుగు, తమిళ భాషల్లో ఒకే రోజున విడుదల కానుంది. ఈ సినిమా హారర్ సినిమాగా ఏప్రిల్ 24న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. అయితే ఈ సినిమా అన్ని హారర్ సినిమాల కంటే చాలా డిఫరెంట్. దానికి కారణం ఈ సినిమా త్రీడీలో విడుదల కావడం.

హాలీవుడ్ లేదా బాలీవుడ్ లో హారర్ సినిమాలు 3డి లో విడుదల అయ్యాయి. కానీ తెలుగులో హారర్ సినిమా 3డిలో విడుదల కావడం ఇదే మొట్టమొదటిసారి. ఆ ఘనత అంజలి కే దక్కింది. భారీ విజువల్ ఎఫెక్ట్స్ తో దయ్యాన్ని త్రీడీలో చూపిస్తూ దర్శక నిర్మాతలు ఈ సినిమాతో మనల్ని బీభత్సంగా భయపెట్టనున్నారన్నమాట. గత కొంత కాలంగా తెలుగులో ఫ్లాపులను అందుకుంటున్న అంజలి ఈ సినిమాపైనే తన ఆశలన్నీ పెట్టుకుంది. సినిమాటోగ్రాఫర్ పి.జి.ముత్తయ్య ఈ సినిమాని నిర్మిస్తున్నారు.