బాలయ్యతో గ్యారెంటీగా హిట్ కొడతాడట!

వినయ విధేయ రామ సినిమాతో డిజాస్టర్ అందుకున్న బోయపాటి శ్రీను, తన నెక్స్ట్ మూవీకి రెడీ అవుతున్నాడు. బాలయ్య హీరోగా ఈ సినిమా త్వరలోనే సెట్స్ పైకి రాబోతోంది. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న బోయపాటి, ఈ మూవీ వివరాల్ని వెల్లడించాడు. మరో 10 రోజుల్లో బాలయ్య సినిమాకు సంబంధించి పూర్తి స్క్రిప్ట్ రెడీ అయిపోతుందని ప్రకటించాడు ఈ దర్శకుడు.

తన ట్రేడ్ మార్క్ యాక్షన్ అని చెప్పుకునే బోయపాటి, అదే తరహా యాక్షన్ సన్నివేశాలతో వినయ విధేయ రామ సినిమాను బోర్ కొట్టించాడు. లాజిక్ లేని యాక్షన్ సన్నివేశాలు, కనెక్షన్ లేని స్క్రీన్ ప్లేతో సినిమాను డిజాస్టర్ చేశాడు. సినిమా ఫ్లాప్ కు నూటికి నూరుశాతం బోయపాటే కారణం అంటూ విమర్శకులు విరుచుకుపడ్డారు. ఈ నేపథ్యంలో బాలయ్యతో చేయాల్సిన సినిమాకు ఇతడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నాడనేది ఆసక్తికరంగా మారింది.

బోయపాటి మాత్రం తన మార్క్ నుంచి బయటకు వచ్చేది లేదని స్పష్టంచేశాడు. బాలయ్యతో ఊరమాస్ సినిమానే తీయబోతున్నానని ప్రకటించాడు. భారీ ఫైట్లు, మాస్ డైలాగ్స్ ఉంటాయని స్పష్టంచేశాడు. ఇవన్నీ ఉంటే ఫర్వాలేదు, లాజిక్ లేకుండా సన్నివేశాలుంటేనే ఇబ్బంది. ఈ విషయంలో బోయపాటి జాగ్రత్తగా ఉంటే అదే మంచిదేమో…!