హిట్టైన క్రికెట్ కాన్సెప్టులు.. మరిన్ని స్పోర్ట్స్ డ్రామాలకు స్వాగతం!

‘మజిలీ’ సినిమాలో హీరో క్రికెటర్.. రైల్వేస్ కు ఆడాలనే తపనతో ఉంటాడు. సినిమాలో కాన్సెప్ట్ ప్రేమ, పెళ్లి గురించి అయినా.. సినిమా ఆసాంతం క్రికెట్ ప్రస్తావనతోనే సాగుతుంది. క్లైమాక్స్ ను కూడా క్రికెట్ ద్వారానే మలుపు తిప్పి కథను ముగించారు.

ఇక ‘జెర్సీ’ టైటిల్లోనే స్పోర్ట్స్ టర్మ్ ను పెట్టుకుంది. ఇందులో కూడా హీరో క్రికెటర్. ఫస్ట్ లుక్ నుంచినే ఆ విషయాన్ని స్పష్టం చేస్తూ వచ్చారు. విశేషం ఏమిటంటే.. రెండు సినిమాల్లోనూ హీరోలు కెరీర్ పరంగా ఫెయిల్యూర్స్ ను ఎదుర్కొని ఉంటారు.

సినిమాల్లో హీరోలు ఫెయిల్యూర్స్ అయినా, ఈ రెండు సినిమాలు హిట్ అయ్యాయి. ఇప్పటికే ‘మజిలీ’ సినిమా సూపర్ హిట్ గా డిక్లేర్డ్ అయ్యింది. నాగ చైతన్య కెరీర్ లోనే భారీ హిట్ గా నిలిచింది. ఇప్పటికే ఆ సినిమా యాభై కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లను దాటేసింది.

ఇప్పటికీ కలెక్షన్లకు లోటు ఏమీ లేదు. ఈ వారంలో కొత్త సినిమాలు పోటీ వచ్చినా ఫర్వాలేదు. ఇక నాని స్పోర్ట్స్ డ్రామా క్లాసిక్ గా నిలిచిపోతుందని రివ్యూయర్లు అంటున్నారు.

ఇలా రెండు స్పోర్ట్స్ డ్రామాలు వరసగా విజయవంతం అయ్యాయి. క్రికెట్ తో ముడిపడిన సినిమాలు సూపర్ హిట్ అనిపించుకుంటున్నాయి. మరి ఇవి తెలుగులో మరిన్ని స్పోర్ట్స్ డ్రామాలకు స్వాగతం పలికే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి.

ఇది వరకూ కూడా పలు స్పోర్ట్స్ డ్రామాలు వచ్చాయి. తెలుగులో కూడా కబడ్డీ నేపథ్యంలో కొన్ని సినిమాలు వచ్చాయి. తాజా రెండు సినిమాల విజయాలతో మరిన్ని క్రీడా నేపథ్య సినిమాలు వచ్చేలా ఉన్నాయి. బాలీవుడ్ లో కూడా ఈ ట్రెండ్ కొనసాగుతూ ఉన్న విషయాన్ని గమనించవచ్చు.