కుటుంబంతో షూటింగ్ కు వచ్చిన బన్నీ

కొత్త సినిమా.. ఫస్ట్ షెడ్యూల్.. మొదటి రోజు షూటింగ్.. కాస్త బెరుకుగానే ఉంటుంది ఎవరికైనా. కానీ బన్నీ మాత్రం తన కొత్త సినిమా మొదటి షెడ్యూల్, మొదటి రోజు షూటింగ్ కు సకుటుంబ సపరివార సమేతంగా విచ్చేశాడు. స్పాట్ లో ఎన్ని షాట్స్ తీశారో తెలీదు కానీ, బన్నీని చూస్తే కుటుంబంతో పాటు పిక్నిక్ కు వచ్చినట్టు కనిపించాడు.

త్రివిక్రమ్-బన్నీ కాంబినేషన్ లో ఆమధ్య కొత్త సినిమా లాంఛ్ అయిన విషయం తెలిసిందే. ఆ మూవీ రెగ్యులర్ షూటింగ్ ఇవాళ్టి నుంచి స్టార్ట్ అయింది. మొదటి రోజు షూటింగ్ లో బన్నీతో పాటు ఆయన పిల్లలు, భార్య, తండ్రి అల్లు అరవింద్ తో పాటు ఇతర కుటుంబ సభ్యులు కూడా కనిపించారు. దీంతో లొకేషన్ మొత్తం సందడిగా మారిపోయింది.

ఈ సినిమాను అల్లు అరవింద్, చినబాబు కలిసి నిర్మిస్తున్నారు. కాబట్టి ఇకపై సెట్స్ లో రాధాకృష్ణతో పాటు అరవింద్ కూడా కనిపిస్తారు. వీళ్లిద్దర్నీ మెప్పిస్తూ త్రివిక్రమ్ సన్నివేశాలు తీయాల్సి ఉంటుంది. ఈ సినిమాలో బన్నీ సరసన మరోసారి పూజా హెగ్డే హీరోయిన్ గా నటించనుంది. మరో కీలక పాత్ర కోసం టబును తీసుకున్నారు. వీళ్లతో పాటు సత్యరాజ్ కూడా ఓ ముఖ్యపాత్రకు ఎంపికయ్యాడు. తమన్ ఇప్పటికే మ్యూజిక్ సిట్టింగ్స్ స్టార్ట్ చేశాడు. ఈ ఏడాది దసరాకు సినిమాను రిలీజ్ చేయాలనేది ప్లాన్.