Telugu Global
NEWS

అధికారం దక్కదా..? తమ్ముళ్లలో ఆందోళన !

ఆంధ్రప్రదేశ్ తెలుగుదేశం పార్టీ నేతల్లో భయం ప్రారంభమైనట్టు కనిపిస్తోంది. పార్టీలోని కీలక నాయకులు చేస్తున్న ప్రకటనలు, వ్యాఖ్యానాలు తెలుగు తమ్ముళ్లలో తీవ్ర చర్చకు దారి తీస్తున్నాయంటున్నారు. కొందరు నాయకులు వైసీపీ డబ్బులు బాగా వెదజల్లిందని మాట్లాడుతుంటే, మరి కొందరు నాయకులు మాత్రం ఎన్నికల కోసం తాము కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టాల్సి వచ్చిందని అంటున్నారు. అనంతపురానికి చెందిన సీనియన్ నేత ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి దాదాపు ఇలాంటి వ్యాఖ్యానాలే చేశారు. గతంలో ఒకసారి స్పీకర్ కోడెల […]

అధికారం దక్కదా..? తమ్ముళ్లలో ఆందోళన !
X

ఆంధ్రప్రదేశ్ తెలుగుదేశం పార్టీ నేతల్లో భయం ప్రారంభమైనట్టు కనిపిస్తోంది. పార్టీలోని కీలక నాయకులు చేస్తున్న ప్రకటనలు, వ్యాఖ్యానాలు తెలుగు తమ్ముళ్లలో తీవ్ర చర్చకు దారి తీస్తున్నాయంటున్నారు. కొందరు నాయకులు వైసీపీ డబ్బులు బాగా వెదజల్లిందని మాట్లాడుతుంటే, మరి కొందరు నాయకులు మాత్రం ఎన్నికల కోసం తాము కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టాల్సి వచ్చిందని అంటున్నారు.

అనంతపురానికి చెందిన సీనియన్ నేత ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి దాదాపు ఇలాంటి వ్యాఖ్యానాలే చేశారు. గతంలో ఒకసారి స్పీకర్ కోడెల శివప్రసాద్ రావు కూడా దాదాపుగా ఇలాంటి వ్యాఖ్యలే చేశారని పలువురు గుర్తు చేస్తున్నారు. ఎన్నికల తరువాత కీలక నాయకులు చేసే వ్యాఖ్యానాలు, ప్రకటనలు మాత్రం కార్యకర్తల్లో గుబులు పుట్టిస్తున్నాయి. మరో వైపు విజయం తమదే అంటూ ముఖ్యమంత్రి చేస్తున్న ప్రకటనలు చూసి తెలుగు తమ్ముళ్లు ఆశ్చర్య పోతున్నారని అంటున్నారు.

నాయకులు అంగీకరించకపోయినా…. కిందిస్థాయిలో మాత్రం ఇక అధికారం తమది కాదనే క్లారిటీ వచ్చేసిందనే చెబుతున్నారు. టీడీపీ నేతలకు కూడా ఈ విషయం తెలుసని, కార్యకర్తల్లో మనో ధైర్యం నింపడానికి వారు రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. చంద్రబాబు మాత్రం తన ఉపన్యాసాలలో ఈవీఎంలను వదలడం లేదు. మహారాష్ట్రలో జరిగిన ఒక ప్రచార సభలో చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ రష్యా నుంచి ఈవీఎంలను హ్యాక్ చేస్తున్నారని చెప్పుకొచ్చారు.

ఒక వైపు తామే గెలుస్తున్నామని చెబుతూనే….. మరోవైపు ఈవీఎంలను హ్యాక్ చేస్తున్నారని చెప్పడం ఏమిటో అర్థం కావడం లేదని పలువురు అంటున్నారు. రేపు ఒకవేళ నిజంగా టీడీపీ విజయం సాధిస్తే, ఈవీఎంలను హ్యాక్ చేసే గెలిచారా? అంటూ ఎవరైనా అడిగితే ఏం సమాధానం చెబుతారని ప్రశ్నిస్తున్నారు.

ఈ పరిణామాలను గమనిస్తున్న కిందిస్థాయి నేతలు, కార్యకర్తల్లో గుబులు మొదలైందని అంటున్నారు. ఎందుకంటే అధికారంలో ఉన్న ఈ ఐదేళ్లూ చంద్రబాబు పట్టించుకోకపోవడంతో ఎమ్మెల్యేలతోపాటు, కిందిస్థాయి నేతలు కూడా దాష్టీకాలు చేశారు. ఇటు ప్రజలతోనూ, అటు అధికారులతోనూ ఇష్టానుసారంగా ప్రవర్తించారు. అధికారం కోల్పోతే తమ గతి ఏమవుతుందోననే వారిలో ఆందోళన మొదలైందని అంటున్నారు.

First Published:  23 April 2019 11:21 PM GMT
Next Story