Telugu Global
NEWS

సొంత మనుషులను వదిలేసి మమ్మల్ని అంటే ఎలా..! తెలుగు తమ్ముళ్లు

ఐదు సంవత్సరాల పాటు అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీలో అంతర్గత విభేదాలు ఎన్నికల తర్వాత బయట పడుతున్నాయి. ఈ ఎన్నికలలో ఓటమి పాలైతే దానికి కారణం అభ్యర్థులే అంటూ తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలపై తెలుగు తమ్ముళ్లు సీరియస్ అవుతున్నారని అంటున్నారు. గడచిన ఐదు సంవత్సరాలుగా తన సామాజిక వర్గానికి చెందిన వారు అధికారులపైనా, ప్రజల పైనా ఇష్టారీతిగా వ్యవహరించారని, దాని ప్రభావం ఎన్నికలపై పడిందని తెలుగు తమ్ముళ్ల అంచనా. పశ్చిమ గోదావరి […]

సొంత మనుషులను వదిలేసి మమ్మల్ని అంటే ఎలా..! తెలుగు తమ్ముళ్లు
X

ఐదు సంవత్సరాల పాటు అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీలో అంతర్గత విభేదాలు ఎన్నికల తర్వాత బయట పడుతున్నాయి. ఈ ఎన్నికలలో ఓటమి పాలైతే దానికి కారణం అభ్యర్థులే అంటూ తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలపై తెలుగు తమ్ముళ్లు సీరియస్ అవుతున్నారని అంటున్నారు.

గడచిన ఐదు సంవత్సరాలుగా తన సామాజిక వర్గానికి చెందిన వారు అధికారులపైనా, ప్రజల పైనా ఇష్టారీతిగా వ్యవహరించారని, దాని ప్రభావం ఎన్నికలపై పడిందని తెలుగు తమ్ముళ్ల అంచనా. పశ్చిమ గోదావరి జిల్లాలో చింతమనేని ప్రభాకర్, విజయవాడ నగరంలో కేశినేని నాని వంటి తెలుగుదేశం ప్రజా ప్రతినిధులు అధికారులపై చేయి చేసుకున్నారని…. వీరిద్దరి లాగే ఇతర జిల్లాల్లో ముఖ్యమంత్రి సామాజిక వర్గానికి చెందిన వారు దారుణంగా ప్రవర్తించారని తెలుగు తమ్ముళ్లు చెబుతున్నారు.

వీటిని పక్కన పెట్టి తాము సరిగా పని చేయకపోవడం వల్లే ఓటమి పాలవుతామన్నట్లుగా వ్యాఖ్యానించడాన్ని తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారంటున్నారు.

రెండు రోజుల క్రితం అమరావతిలో తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు నిర్వహించిన సమావేశంలో తెలుగు తమ్ముళ్లపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. మూడున్నర సంవత్సరాల వరకు భారతీయ జనతా పార్టీతో సఖ్యంగా మెలిగిన చంద్రబాబు నాయుడు ప్రత్యేక హోదా గురించి పక్కన పెట్టడం ప్రజల్లో తీవ్ర అసహనానికి గురి చేసిందని, దాని గురించి మాట్లాడకుండా తమను నిందించటం ఏమిటని తెలుగు తమ్ముళ్లు ప్రశ్నిస్తున్నారు.

కొన్నాళ్ల పాటు ప్రత్యేక ప్యాకేజీ మేలు అంటూ చెప్పిన చంద్రబాబు నాయుడు ఆ తర్వాత మాట మార్చడం ప్రజల్లో ఆగ్రహాన్ని తెప్పించింది అని చెబుతున్నారు.

నాలుగున్నర సంవత్సరాల పాటు ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టకుండా చివరి రోజుల్లో పసుపు కుంకుమ అంటే మహిళలు ఎలా నమ్ముతారని తెలుగు తమ్ముళ్లు ప్రశ్నిస్తున్నారు.

ఐదు సంవత్సరాల పాటు చంద్రబాబు నాయుడు, ఆయన వర్గీయులు డబ్బు సంపాదనపై దృష్టి పెట్టారని, ప్రతిపక్ష నేత జగన్ మాత్రం పాదయాత్రతో ప్రజల్లోనే ఉన్నారని, దానిని ప్రజలు గుర్తించడం వల్లే పార్టీకి వ్యతిరేకంగా ఓటేశారని తెలుగు తమ్ముళ్లు అంచనా వేస్తున్నారు.

First Published:  23 April 2019 10:34 PM GMT
Next Story