సీజే మీదే కుట్ర జరిగితే…. సామాన్యుల గతేంటి?

రామధనస్సు కింద నలిగిన కప్పను ఓదార్చిన శ్రీరాముడు… ధనస్సు పెట్టక ముందే ఎందుకు చెప్పలేదు అని అడిగాడట. దానికి సమాధానంగా నాకు ” ఏ ఆపద వచ్చినా మొర పెట్టుకునే శ్రీరాముడే నామీద విల్లు పెడితే ఇక ఎవరికి చెప్పమంటావు రామా”… అని అన్నదట. దేశంలో న్యాయవ్యవస్థ తీరు కూడా ఈ పురాణ గాథ లాగే ఉందంటున్నారు.

దేశ ప్రజలలో ఎవరికి ఏ కష్టం వచ్చినా సుప్రీం కోర్టును ఆశ్రయించేవారు. ఇప్పుడు సాక్షాత్తు సుప్రీం కోర్టు వ్యవస్థ తీరు పతాక శీర్షికలకు ఎక్కుతుంటే ఇక ఎవరికి చెప్పుకోవాలని ఆవేదన చెందుతున్నారు. సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టీస్ రంజన్ గొగోయ్ పై లైంగిక వేధింపుల ఆరోపణలు రావడం దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది.

సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి వ్యవహారం గత కొన్ని రోజులుగా సంచలనంగా మారింది. తనను అప్రదిష్ట పాలు చేసేందుకు కొందరు పెద్దలు “మహాకుట్ర” చేసారని ప్రధాన న్యాయమూర్తి గొగోయ్ అంటున్నారు. చాలామంది న్యాయమూర్తులు కూడా సీజే మాటలు విశ్వసిస్తున్నారు. ఒక తీర్పు విషయంలో తమకు అన్యాయం చేసారనే కారణంతో ఇద్దరు సుప్రీం కోర్టు ఉద్యోగులు ప్రధాన న్యాయమూర్తిని ఇందులో ఇరికించారని కొత్తగా వార్తలు వస్తున్నాయి.

ఈ వివాదంపై బుధవారం నాడు సుప్రీం కోర్టు న్యాయవాది ఉత్సవ్ బెయిన్స్  సీల్డు కవర్లో సుప్రీం కోర్టుకు నివేదికను ఇచ్చారు. దీనిపై పూర్తి స్దాయిలో విచారణ జరుపుతామని సుప్రీం ధర్మాసనం చెబుతోంది.

అయితే ప్రధాన న్యాయమూర్తి పై ఆరోపణలు వాస్తవమా కాదా అనేది పక్కన పెడితే ఇలాంటి వాతావరణం వల్ల సుప్రీం వ్యవస్థకే మచ్చ పడుతోందని న్యాయనిపుణులు ఆందోళన చెందుతున్నారు. దేశ ప్రజలకు భరోస కల్పించాల్సిన అత్యున్నత న్యాయస్థానంలోనే ఇలా జరగడం విస్మయం కలిగిస్తోందంటున్నారు.