‘ఆర్ఆర్ఆర్’ కి హీరోయిన్ ని రికమెండ్ చేసిన సల్మాన్ ఖాన్

తెలుగు ప్రేక్షకులందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్న సినిమాలలో ‘ఆర్ఆర్ఆర్’ కూడా ఒకటి. రామ్ చరణ్, ఎన్టీఆర్ హీరోలుగా నటిస్తున్న ఈ సినిమాకి రాజమౌళి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు మరియు ఎన్టీఆర్ కొమరం భీమ్ పాత్రలో కనిపించబోతున్న సంగతి తెలిసిందే.

రామ్ చరణ్ సరసన బాలీవుడ్ బ్యూటీ అలియాభట్ హీరోయిన్ గా నటిస్తోంది. ఇక ఎన్టీఆర్ సరసన నటించాల్సిన హాలీవుడ్ నటి డైజీ ఎడ్గర్ జోన్స్ సినిమా నుంచి తప్పుకోవడంతో ఆమె పాత్ర కోసం ఇప్పుడూ బోలెడు పేర్లు బయటకు వస్తున్నాయి.

ఇప్పటికే ప్రభాస్ ‘సాహో’ బ్యూటీ శ్రద్ధ కపూర్ మరియు బాలీవుడ్ బ్యూటీ పరిణీతి చోప్రా లను ఈ పాత్ర కోసం సంప్రదించినట్లు సమాచారం అందుతోంది. కాని డేట్లు లేక వారు తిరస్కరించినట్లు తెలుస్తోంది.

తాజా సమాచారం ప్రకారం ఈ జాబితాలో చేరిన కొత్త పేరు జాక్వెలిన్ ఫెర్నాండేజ్. బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ స్వయంగా పేరును ఈ సినిమా కోసం రాజమౌళి కి రికమెండ్ చేసినట్లుగా తెలుస్తోంది. అయితే దీని గురించి అధికారిక ప్రకటన మాత్రం ఇంకా వెలువడలేదు. ఈ సినిమాలో బాలీవుడ్ నటుడు అజయ్ దేవగన్ కీలకపాత్ర పోషిస్తున్న సంగతి తెలిసిందే.