కృతజ్ఞతలు ఎవరికి పవన్ ?

పవన్ కళ్యాణ్. జనసేన పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు. ఆంధ్ర ప్రదేశ్ శాసనసభ, లోక్ సభ ఎన్నికలలో తమ పార్టీ అభ్యర్థులను ఎన్నికల బరిలో నిలిపాడు పవన్ కళ్యాణ్. ఎన్నికల ప్రచారంలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా పర్యటనలు చేశాడు. ఇందులో భాగంగా అధికార తెలుగుదేశం పార్టీకి అనుకూలించేలా ప్రచారాన్ని సాగించారని విమర్శలు వచ్చాయి.

పవన్ కళ్యాణ్ కూడా ఎన్నికల అనంతరం జరిగిన అభ్యర్థుల సమావేశంలో తమకు ఇప్పుడు అధికారం రాకపోవచ్చునని, ఈ ఎన్నికలు భవిష్యత్తుకు పునాది అని సందేశాత్మకంగా చెప్పారు. ఈ వ్యాఖ్యలతో కోట్ల రూపాయలు ఖర్చుపెట్టి ఎన్నికల బరిలో నిలిచిన అభ్యర్థులు ఖంగుతిన్నట్లుగా సమాచారం.

యువతీ, యువకులు, పవన్ కళ్యాణ్ సామాజిక వర్గం జనసేనకు అండగా నిలిచిందని సంబర పడుతున్న వేళ పవన్ కళ్యాణ్ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఏమిటని అభ్యర్థులు తమలో తాము చర్చించుకున్నట్లు సమాచారం.

ఒకవైపు ఈ తంతు నడుస్తుండగా.. మరోవైపు పవన్ కళ్యాణ్ కృతజ్ఞతల పర్యటన పేరుతో ఆంధ్రప్రదేశ్ లో అన్ని జిల్లాల్లో పర్యటిస్తానని పార్టీ అభ్యర్థుల దగ్గర ప్రస్తావించినట్లు సమాచారం. ఎన్నికల ఫలితాలు రావడానికి దాదాపు నెల రోజుల సమయం ఉందనగా ఈ కృతజ్ఞత పర్యటనలు ఏమిటంటూ ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులు, పార్టీలో ఉన్న సీనియర్ నాయకులు ప్రశ్నిస్తున్నట్లు సమాచారం.

ఆంధ్రప్రదేశ్ లో జరిగిన ఎన్నికలలో జనసేనకు ఎవరు ఓటు వేశారు? ఏ అభ్యర్థులు గెలుస్తారు? జనసేన పార్టీకి అసలు ఎన్ని ఓట్లు వచ్చాయి? వంటి వివరాలు కూడా తెలియకుండా కృతజ్ఞత సభల పేరుతో పర్యటించడం ఏమిటంటూ ప్రశ్నిస్తున్నారు. పవన్ కళ్యాణ్ పర్యటనలకు ఏ జిల్లాకు వచ్చినా ఆ ఖర్చంతా ఆ జిల్లా నాయకులు మీదే పడుతోందని, ఇటీవలే ముగిసిన ఎన్నికలలో ఖర్చుచేసి కుదేలైన తమకు మళ్లీ కొత్త ఖర్చును తీసుకు రావడం ఏమిటంటూ అభ్యర్థులు ప్రశ్నిస్తున్నారని సమాచారం.

జనసేన పోటీ చేసిన స్థానాలలో సగం పైన విజయం సాధించినా… లేదూ ఈ ఎన్నికలలో గట్టిపోటీ ఇచ్చామని తేలినా కృతజ్ఞత సభల పేరుతో పర్యటించడం సబబని, ఇలాంటివేవీ తేలకుండా పర్యటించడం అనాలోచిత నిర్ణయం అని అంటున్నారు. ఇలాంటి నిర్ణయాలతో ఎప్పుడు ఏ అవాంతరం ముంచుకొస్తుందోనని జనసేన నాయకులు బెంబేలెత్తుతున్నట్లు సమాచారం.