రోహిత్ హత్య కేసులో భార్య ఇలా దొరికిపోయింది..!

కాంగ్రెస్ సీనియర్ నేత ఎన్డీ తివారి కొడుకు రోహిత్ తివారీ హత్యకు గురైన విషయం అందరికీ తెలిసిందే. తొలుత అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకున్న ఢిల్లీ పోలీసులు పోస్టు మార్టం రిపోర్టు వచ్చిన తర్వాత అది హత్యగా గుర్తించారు. దీంతో అనుమానితులను అందరినీ అదుపులోనికి తీసుకొని విచారించారు.

రోహిత్ హత్య జరిగిన రోజు ఆ ఇంట్లో ఉన్న భార్య, అతని తల్లిని పోలీసులు మూడు రోజుల పాటు విచారించిన తర్వాత భార్య అపూర్వ శుక్లా నిందితురాలని పోలీసులు ఒక నిర్థారణకు వచ్చినట్లు తెలుస్తోంది. అయితే అపూర్వ ఎలా దొరికిపోయిందనే దానిపై ఢిల్లీ పోలీసుల సమాచారం ఇలా ఉంది.

2017లో రోహిత్‌ను అపూర్వ ఒక మాట్రిమోనీ సైట్ ద్వారా కలుసుకొని వివాహం చేసుకుంది. సుప్రీంకోర్టులో న్యాయవాదిగా పని చేస్తున్న అపూర్వ మొదటి నుంచి రోహిత్‌తో సఖ్యతగా లేదు. రోహిత్‌కు చెందిన ఒక ఆస్తి విషయమై వీరిద్దరి మధ్య ఎప్పుడూ గొడవలు జరుగుతుండేవి. అయితే ఈ నెల 16న వీరిద్దరి మధ్య ఇదే విషయమై వీరిద్దరి మధ్య గొడవ జరిగింది. అదే సమయంలో ఒక బంధువుకు చెందిన విషయం కూడా వీరిద్దరి మధ్య గొడవను పెద్దదిగా చేసింది.

ఆ రోజు రోహిత్ తాగిన మైకంలో ఉండటంతో అపూర్వ అనుకోకుండా అతడిని దిండుతో ఊపిరాడకుండా చేసి చంపేసింది. ఇదంతా అప్పటికప్పుడు జరిగిందే తప్ప ముందస్తు ప్రణాళిక లేదు. ఇక ఆ తర్వాత అపూర్వ తన లాయర్ బ్రెయిన్ ఉపయోగించి ఆధారాలన్నీ మాయం చేసింది. అప్పటికే వాళ్ల ఇంట్లోని రెండు సీసీ కెమేరాలు పని చేయట్లేదు. దాన్ని ఆసరా చేసుకొని మిగతా 5 కెమేరాల డేటాను కూడా తొలగించింది.

అయితే, ఆ ఇంటిలోకి ఎవరూ కొత్త వ్యక్తి వచ్చినట్లు, తలుపులు బలవంతంగా తెరిచినట్లు ఆధారాలు క్లూస్ టీంకు దొరకలేదు. దీంతో అపూర్వను పోలీసులు గట్టిగా ప్రశ్నించడంతో నేరం ఒప్పుకున్నట్లు సమాచారం. ఇదంతా గంటన్నరలో జరిగిపోయిందని ఆమె పోలీసులకు చెప్పిందని సమాచారం.