చంద్రబాబు అక్రమాస్తుల కేసు…. విచారణ ప్రారంభం

చంద్రబాబు పై నమోదైన అక్రమ ఆస్తుల కేసును…. హైదరాబాద్‌ ఏసీబీ కోర్టు తిరిగి విచారణ ప్రారంభించింది.

కొద్దిరోజుల క్రితమే సుప్రీం కోర్టు దేశవ్యాప్తంగా దీర్ఘకాలంగా కేసులపై ఉన్న స్టేలను ఎత్తివేయాలని ఆదేశించింది. సుప్రీంకోర్టు ఆదేశాలతో చంద్రబాబు తెచ్చుకున్న స్టే ఇప్పుడు రద్దయినట్లయింది. దీనివల్ల ఇప్పుడు చంద్రబాబు హైకోర్టు నుంచి తెచ్చుకున్న స్టే రద్దయింది.

చంద్రబాబు అక్రమాస్తుల పై 2005లో లక్ష్మీపార్వతి ఏసీబీ కోర్టును ఆశ్రయించారు. ఈ ఆక్రమాస్తుల కేసు విచారణ జరగకుండా అప్పట్లో చంద్రబాబు హైకోర్టులో స్టే తెచ్చుకున్నాడు.

ఈ కేసుకు సంబంధించి కోర్టుకు హాజరుకావాలని లక్ష్మీపార్వతికి సమన్లు జారి చేసింది హైదరాబాద్‌ ఏసీబీ కోర్టు. ఈరోజు లక్ష్మీపార్వతి కోర్టుకు హాజరయ్యారు. కేసు కొనసాగింపు పై స్టేటస్‌ రిపోర్ట్‌ దాఖలు చేయాలని ఏసీబీ కోర్టు ఆదేశించింది. తదుపరి విచారణ మే 13 కు వాయిదా వేసింది హైదరాబాద్‌ ఏసీబీ కోర్టు.

కోర్టుకు హాజరైన తరువాత మీడియాతో మాట్లాడారు ఎన్టీఆర్‌ సతీమణి లక్ష్మీ పార్వతి.

చంద్రబాబు ప్రతి ఎన్నికల అఫిడవిట్‌లోనూ ఆదాయానికి సంబంధించి చాలా తేడాలున్నాయన్నారు లక్ష్మీ పార్వతి.

హైటెక్‌ సిటీలో చంద్రబాబు తల్లికి అత్యంత ఖరీదైన భూమి ఎక్కడిదని ఆమె ప్రశ్నించారు. నారావారి పల్లెలో రెండెకరాల భూమి ఉన్న చంద్రబాబు తల్లికి హైదరాబాద్‌లో అంత ఖరీదైన భూమిని కొనే స్థోమత లేదన్నారు ఆమె. అలాంటిది ఆ భూమిని కొని మనవడికి గిఫ్ట్‌గా ఇచ్చినట్లు చూపారని…. దీనిపై పూర్తి స్థాయిలో విచారణ జరపాలని కోరారు ఆమె.

అయితే అప్పట్లో చంద్రబాబు సతీమణి భువనేశ్వరికి కూడా ఆదాయమే లేదన్నారు ఆమె. భువనేశ్వరి కోట్ల విలువైన భూమిని అమ్మినట్టుగా, ఆదాయం వచ్చినట్లుగా చంద్రబాబు చూపారన్నారు.

అందుకే చంద్రబాబు అవినీతిపై ఏసీబీ కోర్టులో ఫిర్యాదు చేశానన్నారు లక్ష్మీ పార్వతి. చంద్రబాబుకు శిక్షపడేంత వరకు పోరాడతానన్నారు ఆమె.