ఎన్నికల ఫలితాలు ఆలస్యం..?

మే 23న జరిగే ఎన్నికల కౌంటింగ్ తర్వాత ఫలితాలను వెల్లడించడానికి 4 నుంచి 6 గంటల అదనపు సమయం పడుతుందని తెలుస్తోంది. ప్రతిపక్షాలు సుప్రీంలో దాఖలు చేసిన పిటిషన్ నేపథ్యంలో ప్రతీ నియోజకవర్గంలోని 5 పోలింగ్ కేంద్రాల వీవీప్యాట్ స్లిప్పులను లెక్కించాల్సి ఉంది. దీంతో గతంలో కంటే ఎన్నికల ఫలితాలు వెలువడటానికి మరింత సమయం పట్టే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

ఇక ఏపీ విషయానికి వస్తే ఇది మరింత ఆలస్యం అయ్యే అవకాశం ఉది. ఇక్కడ ప్రతీ పార్లమెంటు నియోజకర్గంలోని 5 పోలింగ్ కేంద్రాలతో పాటు.. అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలోని పోలింగ్ కేంద్రాల వీవీప్యాట్లను కూడా లెక్కించాల్సి ఉంటుంది. దీంతో సాయంత్రం 5 గంటలకల్లా వెలువడాల్సిన తుది ఫలితాలు కొన్ని చోట్ల రాత్రి 12 తర్వాత వెలువడే అవకాశం ఉందని ఎన్నికల సంఘం చెబుతోంది.

సుప్రీంకోర్టు ఆదేశాలను తప్పక పాటించాలి కాబట్టి.. ఈవీఎంలను లెక్కించిన తర్వాత వీవీప్యాట్లను తప్పక లెక్కిస్తారు. రెండు సమానంగా ఉన్నప్పుడు మాత్రమే ఫలితాన్ని వెలువరిస్తారు. మరోవైపు వీవీ ప్యాట్లను సాధారణ సిబ్బంది కాకుండా పరిశీలకుల సమక్షంలో రిటర్నింగ్ అధికారులు లెక్కిస్తారు. దీంతో సమయం మరింతగా పెరగనున్నట్లు తెలుస్తోంది.

ప్రతీ కౌంటింగ్ కేంద్రంలో ఈవీఎంల లెక్కింపు పూర్తయినా ఆ ఫలితాలను రిటర్నింగ్ అధికారి వెలువరించే అవకాశం లేదు. స్వయంగా వీవీప్యాట్లను లెక్కించి.. దాన్ని ఈవీఎంతో సరిచూసుకొని మాత్రమే ఫలితాలు వెలువరించాలి. దీంతో మే 23న ఫలితాలు వెలువడటానికి మరింత సమయం పడుతుందని ఈసీ వర్గాలు చెబుతున్నాయి.