నన్ను క్షమించండి ప్లీజ్

హీరో నిఖిల్, తన అభిమానులకు, ప్రేక్షకులకు క్షమాపణలు చెప్పాడు. దీనికి కారణం అర్జున్ సురవరం సినిమా. వాయిదాల మీద వాయిదాలు పడుతున్న ఈ సినిమా ఎట్టకేలకు మే 1న థియేటర్లలోకి వస్తుందని అంతా ఊహించారు. కానీ ఆశ్చర్యకరంగా అర్జున్ సురవరం సినిమా మరోసారి వాయిదాపడింది. దీంతో అందరికీ క్షమాపణలు చెబుతూ బహిరంగ లేఖ విడుదల చేశాడు నిఖిల్.

ఈ వీకెండ్ ఎవెంజర్స్ ఎండ్ గేమ్ థియేటర్లలోకి వస్తోంది. మజిలీ, జెర్సీ, కాంచన-3 సినిమాలు ఆల్రెడీ థియేటర్లలో సక్సెస్ ఫుల్ గా నడుస్తున్నాయి. ఇలాంటి టైమ్ లో అర్జున్ సురవరం సినిమాను రిలీజ్ చేయడం మంచిది కాదని డిస్ట్రిబ్యూటర్లు సూచించారట. అందుకే వాళ్ల కోరిక మేరకు సినిమాను వాయిదా వేస్తున్నట్టు ప్రకటించాడు నిఖిల్.

నిజానికి ఈ సినిమాకు వాయిదాలు కొత్తకాదు. ఇప్పటివరకు ఈ సినిమా ఎన్నిసార్లు వాయిదాపడిందో లెక్కించడం కూడా కష్టమే. అంతలా ఈ సినిమాపై వాయిదాల పర్వం కొనసాగుతోంది. తాజాగా మరోసారి పోస్ట్ పోన్ అవ్వడంతో నిఖిల్ అందరికీ సారీ చెప్పాడు. లావణ్య త్రిపాఠి హీరోయిన్ గా నటించిన ఈ సినిమాను మే మూడో వారంలో విడుదల చేసే అవకాశం ఉంది.