మహర్షి ప్రీ-రిలీజ్ మరింత ప్రత్యేకం

భరత్ అనే నేను సినిమా ప్రీ-రిలీజ్ ఫంక్షన్ కు ఎన్టీఆర్ ప్రత్యేక అతిథిగా హాజరయ్యాడు. అదే వేడుకకు రామ్ చరణ్ కూడా హాజరుకావాలి. కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల చెర్రీ రాలేదు. సో.. ఇప్పుడు మహర్షి ప్రీ-రిలీజ్ ఫంక్షన్ కు ఎన్టీఆర్ తో పాటు చరణ్ ను కూడా అతిథులుగా ఆహ్వానిస్తారనే ప్రచారం ఊపందుకుంది. ప్రస్తుతం ఎన్టీఆర్-చరణ్ కలిసి ఓ సినిమా చేస్తున్నారు కాబట్టి రావడానికి ఎలాంటి అభ్యంతరం ఉండదనేది వీళ్ల లాజిక్. కానీ మహర్షి యూనిట్ మాత్రం వేరే ప్లాన్స్ లో ఉంది.

అవును.. మహేష్ బాబు కెరీర్ లోనే ప్రతిష్టాత్మక చిత్రం మహర్షి. ఎందుకంటే ఇది మహేష్ కు 25వ సినిమా. అందుకే ఈ సినిమా ప్రీ-రిలీజ్ ఫంక్షన్ ను ప్రత్యేకంగా నిర్వహించాలని అనుకుంటున్నారు. ఇందులో భాగంగా, ఇప్పటివరకు మహేష్ ను డైరక్ట్ చేసిన దర్శకులందర్నీ ప్రీ-రిలీజ్ ఫంక్షన్ కు పిలవాలనుకుంటున్నారట. వాళ్లందరితో వేదికను రంగులమయం చేయాలని అనుకుంటున్నారట.

మహేష్ మొదటి సినిమాకు దర్శకుడు రాఘవేంద్రరావు. అక్కడ్నుంచి స్టార్ట్ చేస్తే గుణశేఖర్, త్రివిక్రమ్, తేజ, శ్రీనువైట్ల, సుకుమార్, సురేందర్ రెడ్డి, వైవీఎస్ చౌదరి, శ్రీకాంత్ అడ్డాల, కొరటాల, పూరి.. ఇలా దర్శకులందర్నీ పిలవాలని ఫిక్స్ అయిందట యూనిట్. త్వరలోనే దీనిపై ఏ అఫీషియల్ స్టేట్ మెంట్ రాబోతోంది. మే 1న నెక్లెస్ రోడ్ లోని పీపుల్స్ ప్లాజాలో మహర్షి ప్రీ-రిలీజ్ ఫంక్షన్ జరుగుతుంది.