అయ్యో పాపం…. మామిడి రైతులు

ఆంధ్రప్రదేశ్ లో అకాల వర్షాలు మామిడి రైతులను కోలుకోని దెబ్బ తీశాయి. వాతావరణంలో మార్పుల కారణంగా అకాల వర్షాలు, ఈదురు గాలులు విరుచుకుపడి ఆంధ్రప్రదేశ్ లో మామిడి రైతుల నడ్డి విరిచాయి.

ఈ వర్షాలు, గాలుల కారణంగా మామిడి రైతులు తీవ్రంగా నష్టపోయారు. పంట చేతికి వచ్చే సమయానికి అపార నష్టం చవి చూడాల్సి వచ్చింది. వర్షాలు, గాలుల కారణంగా ఈ సంవత్సరం 30 శాతం కూడా దిగుబడి రాదని వ్యవసాయ శాఖ అధికారులు చెబుతున్నారు. 

ఎకరానికి కనీసం 5 లేక 6 టన్నుల మామిడి ఉత్పత్తి జరిగేది. అకాల వర్షాల కారణంగా ఉత్పత్తి కాస్తా ఒకటి నుంచి రెండు టన్నులకు పడిపోయిందని వ్యవసాయ అధికారులు చెబుతున్నారు. ఆంధ్రప్రదేశ్ లో ప్రతి ఏటా 9.35 లక్షల  ఎకరాలలో మామిడిని పండిస్తారు. దీని ద్వారా ప్రతి ఏటా 45 లక్షల టన్నుల మామిడి ఉత్పత్తి అవుతుంది. 

ఈ ఏడాది కూడా 9 లక్షల ఎకరాలలో మామిడి సాగు జరిగింది. కానీ మామిడి ఉత్పత్తి మాత్రం 13 లక్షల టన్నుల కంటే ఎక్కువ రాదని అధికారులు  అంచనా వేస్తున్నారు. ఇది ప్రతి ఏడాది ఉత్పత్తితో పోలిస్తే ఈ ఏడాది ఉత్పత్తి 70 శాతం తక్కువని చెబుతున్నారు.

అకాల వర్షాలు, గాలుల కారణంగా ఆంధ్రప్రదేశ్ లో మామిడి పంట వల్ల నాలుగు వేల కోట్ల రూపాయల ఆదాయం తగ్గుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. మామిడి పంటకు ప్రసిద్ది చెందిన నూజివీడు, బంగినపల్లి, విజయనగరం, ప్రకాశం జిల్లాల్లో పంట పూర్తిగా దెబ్బ తింది. ఈ జిల్లాల్లో పండే మామిడిని విదేశాలకు ఎగుమతి చేస్తారు. దీని ద్వారా వేల కోట్ల రూపాయల విదేశీ మారక ద్రవ్యం కూడా వస్తుంది.

నూజివీడు, బంగినపల్లి మామిడిపళ్లకు విదేశాలలో ఎంతో గిరాకి ఉంది. వర్షాల కారణంగా ఈ సారి విదేశాలకు కూడా ఎగుమతులు పూర్తి స్దాయిలో తగ్గుతాయని అంటున్నారు. 

మరో తెలుగు రాష్ట్రమైన తెలంగాణలో కూడా మామిడి రైతుల పరిస్ధితి ఇంచుమించు ఇలాగే ఉంది. తెలంగాణలో కూడా మామిడి రైతులను అకాల వర్షాలు దెబ్బ తీసాయి. వారం, పది రోజులలో చేతికి అందుతుందనుకున్న పంట నేల పాలైంది. దీంతో తెలంగాణ మామిడి రైతులు కూడా తీవ్ర నష్టాల పాలవుతున్నారు.

ఇప్పుడు మామిడి పళ్ళ ధరలు చాలా తక్కువగా ఉన్నాయి. అయితే తెలుగు రాష్ట్రాల నుంచి వచ్చే మామిడి దిగుబడి గణనీయంగా తగ్గిపోవడంతో త్వరలో మామిడి కాయలు, పళ్ల ధరలు భారీగా పెరుగుతాయని మార్కెట్ వర్గాలు పేర్కొంటున్నాయి.