ఎల్లో మీడియా సర్వే కూడా అదే చెబుతుందా?

ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికల్లో ఫలితాలు రావడానికి మూడు వారాలు మాత్రమే సమయం మిగిలింది. బరిలో నిలిచిన అన్ని పార్టీలు విజయం తమదే అంటూ ధీమా గా ఉన్నాయి. ముందస్తు సర్వేలపై ఎన్నికల కమిషన్ నిషేధం పెట్టడంతో ఈసారి సర్వే సంస్థలు కానీ, మీడియా కానీ ఎలాంటి సర్వే లు నిర్వహించడం లేదు. ఒకవేళ నిర్వహించిన ఫలితాలను మాత్రం వెల్లడించడం లేదు.

అయితే అధికార తెలుగుదేశం పార్టీకి వెన్నుదన్నుగా ఉండే పచ్చ మీడియా మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా సర్వే చేసి ఆ ఫలితాల వివరాలను తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడికి అప్పగించినట్లుగా చెబుతున్నారు. ఈ ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ పరాజయం పాలు కాక తప్పదని పచ్చ మీడియా సర్వేలో వెల్లడైనట్లు గా విశ్వసనీయ వర్గాల సమాచారం.

పచ్చ మీడియా నిర్వహించిన సర్వేలో తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకంగా మహిళలు, యువతీ యువకులు ఓటు వేశారని తేలినట్లుగా చెబుతున్నారు. పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరిన మహిళలంతా తెలుగుదేశం పార్టీకి ఓట్లు వేశారు అంటూ ఆ పార్టీ నాయకులు పైకి చెబుతున్నప్పటికీ వాస్తవం మాత్రం అందుకు విరుద్ధంగా ఉందని అంటున్నారు.

పసుపు-కుంకుమ పేరుతో మహిళల ఓట్లను కొల్లగొట్టాలని తెలుగుదేశం పార్టీ భావించినా…. గడచిన నాలుగేళ్లలో తెలుగుదేశం పార్టీ తీసుకున్న ప్రజా వ్యతిరేక నిర్ణయాల పై మహిళలు, యువతీ యువకులు కోపంగా ఉన్నారని సర్వేలో తేలినట్లు చెబుతున్నారు. తమ ఓటమి ఖాయమని భావిస్తున్న తెలుగుదేశం నాయకులు పైకి మాత్రం గుంభనంగా ఉన్నారని, మహిళా ఓటర్లే తమను ముంచుతారా అనే అంశం వారికి మింగుడు పడటం లేదని చెబుతున్నారు. తమ అనుంగు మీడియా ఇచ్చిన సర్వే వివరాలతో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు కూడా ఆందోళన చెందుతున్నారని ఆ పార్టీ నాయకులు అంటున్నారు.