మరిదితో వివాహేతర సంబంధం…. భర్తను హతమార్చిన భార్య

కామాతురాణాం నభయం నలజ్జ అని పెద్దలు ఊరికే అనలేదు. ఇద్దరు పిల్లల తల్లైనా సరే తన శారీరక కోర్కెలను తీర్చుకోవడానికి మరిదితోనే అక్రమ సంబంధం పెట్టుకొని అడ్డుగా ఉన్న భర్తను హతమార్చింది. ఈ సంఘటన హైదరాబాద్ చైతన్యపురి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఇన్‌స్పెక్టర్ సుదర్శన్ కథనం మేరకు..

నల్లగొండ జిల్లా దేవరకొండలోని దేవరపల్లికి చెందిన భానోత్ ధులియా అలియాస్ శంకర్ (33) ‌కు విజయ తో పెండ్లైంది. వారికి ఇద్దరు సంతానం. నగరానికి వలసవచ్చి అలకాపురి కాలనీ సమీపంలోని యాదవనగర్‌లో నివాసం ఉంటున్నారు. విజయ తన భర్తకు సోదరుడి వరుసైన కిషన్‌తో గత కొన్నేళ్లుగా వివాహేతర సంబంధం నెరుపుతోంది.

ఈ క్రమంలో తమకు అడ్డుగా ఉన్న శంకర్‌ను చంపేస్తే.. ఇక హాయిగా బతకొచ్చని ఆమె భావించింది. అదే విషయాన్ని కిషన్‌కు చెప్పింది. శనివారం రాత్రి మద్యంలో గుర్తుతెలియని విషం కలిపి శంకర్‌కు తాగించారు. దీంతో అతను అపస్మారక స్థితికి చేరుకున్నాడు. కొద్ది సేపు అక్కడే ఉన్న కిషన్ తర్వాత ఇంటికి వెళ్లిపోయాడు.

ఉదయాన్నే శంకర్ చనిపోయాడని వార్త తెలుసుకొని కిషన్ అక్కడకు వచ్చి ఏడ్చినట్లు నటించాడు. అయితే శంకర్ ఒంటి మీద ఎలాంటి గాయాలు లేకపోవడం.. మద్యం కూడా ఎక్కువగా తాగకుండానే మరణించడంతో బంధువులకు అనుమానం వచ్చింది.

అంతే కాకుండా కిషన్, విజయల సంబంధం గురించి తెలిసిన కొంత మంది వారిపై అనుమానాలు వ్యక్తం చేసి పోలీసులకు చెప్పారు. దీంతో పోలీసులు వారిద్దరినీ అదుపులోనికి తీసుకొని ప్రశ్నించగా హత్య చేసినట్లు ఒప్పుకున్నారు. శంకర్ మృతదేహాన్ని ఉస్మానియా మార్చురీకి తరలించారు.