సాయిపల్లవి లాంటి భార్య కావాలి నాకు

ప్రస్తుతం నిఖిల్ కు 33 ఏళ్లు. అయితే ఈ హీరో మాత్రం తనకు ఇంకా పెళ్లి వయసు రాలేదంటున్నాడు. ఇప్పట్లో పెళ్లి చేసుకోనంటున్న ఈ హీరో, తనకు కాబోయే భార్య ఎలా ఉండాలో మాత్రం చెబుతున్నాడు. తన మనసులో ఉన్న అలాంటి క్వాలిటీస్ తో అమ్మాయి దొరికితే వెంటనే పెళ్లి చేసుకుంటానంటున్నాడు.

“ఫిదాలో భానుమతిలాంటి అమ్మాయి కావాలి నాకు. అందులో సాయిపల్లవి అద్భుతంగా నటించింది. అలాంటి పిల్ల కనిపిస్తే వెంటనే పెళ్లి చేసుకుంటా. ఇక ఖుషిలో భూమిక క్యారెక్టర్ కూడా నాకు చాలా ఇష్టం. ఈ రెండు సినిమాలతో పాటు గోదావరిలో సీత పాత్ర అంటే ఇష్టం. ఇలాంటి లక్షణాలతో ఎవరైనా కనిపిస్తే వెంటనే పెళ్లి చేసుకుంటా.”

కచ్చితంగా ప్రేమ పెళ్లి చేసుకోవాలని తనకు లేదంటున్నాడు నిఖిల్. ఒకప్పటి ప్రేమలు ఇప్పుడు లేవని, అందుకే లవ్ మ్యారేజ్ చేసుకుంటానని కచ్చితంగా చెప్పలేనన్నాడు. అయితే ప్రేమిస్తే మాత్రం అదే అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని అంటున్నాడు.

“ప్రేమపై నాకు నమ్మకం ఉంది. కానీ లవ్ లో పడితే అది పెళ్లికి దారితీయాలి. ప్రేమించి మధ్యలో వదిలేయకూడదు. అది మంచిది కాదు. అది నాకే కాదు, అమ్మాయికి కూడా మంచిది కాదు. నిజంగా లవ్ లో పడితే పెళ్లి చేసుకోవాలి. చిన్నప్పుడు షారూక్ నటించిన లవ్ సినిమాలు ఎక్కువగా చూశాను కాబట్టి ప్రేమించి పెళ్లి చేసుకోవాలని అనుకున్నాను. కానీ ఇప్పుడు అలాంటి లవ్ ఫీలింగ్స్ పెద్దగా కనిపించడం లేదు.”

నిఖిల్ నటించిన అర్జున్ సురవరం సినిమా మరోసారి వాయిదాపడింది. సినిమా వాయిదా పడినప్పటికీ నిఖిల్ మాత్రం తన ప్రచారం ఆపలేదు. సినిమా విడుదలయ్యేంత వరకు ప్రచారం చేస్తూనే ఉంటాడట. మరోసారి వాయిదా పడితే ఏం చేస్తాడో!