యాదాద్రిలో సీరియ‌ల్ సైకో కిల్ల‌ర్ !

యాదాద్రి జిల్లాలో విద్యార్థినుల హత్యలు కలకలం సృష్టిస్తున్నాయి. శ్రావణి హత్య మరువకముందే అదే ప్లేస్ లో మరో విద్యార్థిని మనీష డెడ్ బాడీ లభించడంతో హైటెన్షన్ మొదలైంది. బొమ్మలరామారం మండలం హాజీపూర్ లో శ్రావణి మృతదేహాన్ని పాతిపెట్టిన బావిలోనే మనీష మృతదేహానికి చెందిన అస్తికలు దొరకడంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. గత మార్చి నెలలో అదృశ్యమైన మనీష శవమై తేలడంతో బంధువులు కన్నీటి పర్యంతం అవుతున్నారు.

శ్రావణి మృతదేహం లభించిన బావిలోనే మరో శవం ఉందన్న సమాచారంతో బావిలో వెతికిన పోలీసులకు మరో శవానికి సంబంధించిన అస్తికలు లభించాయి. ఆ అస్తికలు హాజీపూర్ గ్రామానికి చెందిన మనీషా(18) గా గుర్తించారు పోలీసులు. పోలీసుల సోదాల్లో బావిలో దొరికిన అస్తికలను ఐదు వేర్వేరు బ్యాగుల్లో ప్యాక్ చేసి పోస్టుమార్టం కోసం భువనగిరి ఏరియా ఆస్పత్రికి తరలించారు.

మృతురాలు మనీషా అనే అమ్మాయి కీసరలోని కే.ఎల్.ఆర్. కాలేజీలో బీ.కామ్ చదువుతున్నట్లు పోలీసులు తెలిపారు. బావిలో లభించిన అస్తికలను ఐదు వేర్వేరు బ్యాగుల్లో భద్రపర్చడంతో ఆ అస్తికలన్నీ మనీషాయేనా, వేరే వ్యక్తులకు సంబంధించినవా అని పోలీసులు అనుమానిస్తున్నారు. పోస్టుమార్టం నివేదిక వస్తేగాని ఆ అస్తికలు ఎవరివో తెలియదంటున్నారు.

హాజీపూర్ లో 2015 లో మైసిరెడ్డిపల్లికి చెందిన కల్పన కూడా అదృశ్యం కావడంతో, ఆ కోణంలో పోలీసులు విచారణ చేపట్టారు. శ్రావణి హత్య కేసులో నిందితుడిగా అనుమానిస్తున్న హాజీపూర్ కు చెందిన మర్రి శ్రీనివాస్ రెడ్డి అనే వ్యక్తిని విచారించగా తెలిపిన విషయాల ఆధారంగా ఈ ఘటనలన్నీ వెలుగులోకి వస్తున్నట్లు తెలుస్తోంది.

అయితే ఈ దుశ్చర్యల వెనుక ఇంకెందరి హస్తం ఉందోనన్న కోణంలో విచారిస్తున్నారు పోలీసులు. మా పాప కల్పన అదృశ్యమై నాలుగేళ్లు అవుతుందని, అప్పట్లో పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదన్నారు. సమగ్ర విచారణ చేసి దయచేసి మా పాప కల్పన ఆచూకి తెలపాలని కల్పన బంధువులు వేడుకుంటున్నారు.

శ్రావణి, మనీష హత్య ఉదంతంలో నిందితుడిగా అనుమానిస్తున్న మర్రి శ్రీనివాస్ రెడ్డి నేపథ్యం మొత్తం నేరమయమేనంటున్నారు గ్రామస్తులు. నిందితుడిపై కర్నూలులో ఒక మర్డర్ కేసు, వరంగల్ లో రేప్ కేసుతో పాటు స్థానికంగా బైకు దొంగతనాలకు సంబంధించిన పలు కేసుల్లో నిందితుడుగా ఉన్నాడని గ్రామస్తులంటున్నారు.

శ్రీనివాస్ రెడ్డి అనే వ్యక్తిది సైకో మనస్తత్వమని, అమ్మాయిలను అత్యాచారం చేసి చంపడం అలవాటుగా మార్చుకున్నాడని సంఘటనలను చూస్తే తెలుస్తోందన్నారు.