Telugu Global
NEWS

"దేశం"లో వారసుల టెన్షన్..!

తెలుగుదేశం పార్టీని వారసుల టెన్షన్ వేధిస్తోంది. గతంలో కంటే ఈ సారి ఎన్నికల్లో సీనియర్ నాయకులందరూ ఎన్నికల బరి నుంచి తప్పుకుని వారి వారసులను రంగంలోకి దింపారు. ఒక రకంగా తెలుగుదేశం పార్టీ రెండో తరాన్ని ఈ ఎన్నికల్లో అరంగేట్రం చేయించిందనే చెప్పాలి. అదే ఇప్పుడు వారిని కంటి మీద కునుకు లేకుండా చేస్తోందని అంటున్నారు. తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు తన కుమారుడు నారా లోకేష్ ను ప్రత్యక్ష ఎన్నికల బరిలో […]

దేశంలో వారసుల టెన్షన్..!
X

తెలుగుదేశం పార్టీని వారసుల టెన్షన్ వేధిస్తోంది. గతంలో కంటే ఈ సారి ఎన్నికల్లో సీనియర్ నాయకులందరూ ఎన్నికల బరి నుంచి తప్పుకుని వారి వారసులను రంగంలోకి దింపారు. ఒక రకంగా తెలుగుదేశం పార్టీ రెండో తరాన్ని ఈ ఎన్నికల్లో అరంగేట్రం చేయించిందనే చెప్పాలి. అదే ఇప్పుడు వారిని కంటి మీద కునుకు లేకుండా చేస్తోందని అంటున్నారు.

తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు తన కుమారుడు నారా లోకేష్ ను ప్రత్యక్ష ఎన్నికల బరిలో దించారు. ఆయన మంగళగిరి నుంచి శాసనసభకు పోటీ చేస్తున్నారు. గత ప్రభుత్వంలో ఎమ్మెల్సీగా ఎంపికై నేరుగా మంత్రి అయిపోయిన లోకేష్ కు ప్రత్యక్ష ఎన్నికలు చుక్కలు చూపిస్తున్నాయంటున్నారు.

తన కుమారుడి గెలుపుపై పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడికి కూడా అనుమానాలు వస్తున్నాయని అంటున్నారు. మంగళగిరిలో పద్మశాలీల ఓట్లు అధికంగా ఉన్నాయి. అలాగే బీసీ కులాలకు చెందిన వారు ఎక్కువగా ఉన్నారు. వారంతా గంప గుత్తగా ప్రతిపక్ష వై.ఎస్.ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేశారని చెబుతున్నారు. ఇదే చంద్రబాబు నాయుడిలో టెన్షన్ ను పెంచుతోంది.

ఇక అనంతపురం జిల్లా నుంచి పోటీ చేసిన మంత్రి పరిటాల సునీత కుమారుడు పరిటాల శ్రీరాం విజయంపై కూడా నీలినీడలు కమ్ముకుంటున్నాయి. ఆయన పోటీ చేయడం పార్టీలో చాలా మందికి నచ్చలేదని, వారంతా పైకి తెలుగుదేశం పార్టీకి పని చేసినా లోలోన మాత్రం వై.ఎస్.ఆర్ కాంగ్రెస్ విజయం కోసం కృషి చేశారని అంటున్నారు.

అలాగే అనంతపురం ఎంపీగా పోటీ చేసిన జే.సీ.దివాకర్ రెడ్డి తనయుడు పవన్ కుమార్ రెడ్డి గెలుపు కూడా ఆయనకు నిద్ర పట్టనివ్వడం లేదని చెబుతున్నారు. మహిళల ఓట్లు ఎక్కువ పడ్డాయి… ఇవన్నీ తమకే అని జె.సీ.దివాకర్ రెడ్డి పైకి చెబుతున్నా ఆయన కూడా అంతర్గతంగా ఆందోళన చెందుతున్నారని చెబుతున్నారు.

కర్నూలు నుంచి పోటీ చేసిన టీ.జి.వెంకటేష్ తనయుడు భరత్ విజయం అంత సులభం కాదని జిల్లా వాసులు చెబుతున్నారు. జిల్లాకు చెందిన సీనియర్లు కొందరు భరత్ అభ్యర్ధిత్వాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. వారంతా వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ అభ్యర్ధికే పనిచేశారని చెబుతున్నారు.

విజయనగరం నుంచి పోటీ చేసిన కేంద్ర మాజీ మంత్రి అశోక్ గజపతి రాజు కుమార్తె కూడా గెలుపు ముంగిట బోర్లాపడతారని చెబుతున్నారు. ఇలా తెలుగుదేశం పార్టీలో వారసుల విజయం ఏమంత సులభం కాదని పార్టీ నాయకులే అంటున్నారు.

First Published:  29 April 2019 9:24 PM GMT
Next Story