టాప్-5లో చేరిన కాంచన-3

ఊహించని విధంగా దూసుకొచ్చింది కాంచన-3. అన్నీ తానై లారెన్స్ తెరకెక్కించిన ఈ సినిమా కోలీవుడ్ లోనే కాకుండా, తెలుగులో కూడా అద్భుత విజయాన్ని సొంతం చేసుకుంది.

నెగెటివ్ రివ్యూస్ మధ్య కూడా ఈ సినిమా కాసుల వర్షం కురిపించింది. బి, సి సెంటర్లలో క్లిక్ అవ్వడం కాంచన-3కి బాగా కలిసొచ్చింది. అలా విడుదలైన వారం రోజులకే వరల్డ్ వైడ్ 75 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్ట్ చేసిన ఈ సినిమా, తాజాగా మరో రికార్డు సృష్టించింది. తెలుగులో ఈ ఏడాది విడుదలైన అత్యథిక వసూళ్లు సాధించిన సినిమాల సరసన చేరింది కాంచన-3.

నిన్నటి వసూళ్లతో వరల్డ్ వైడ్ 100 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్ట్ చేసింది కాంచన-3. ఈ ఏడాది సౌత్ లో అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాల్లో ఐదో స్థానంలో నిలిచింది. కాంచన-3 కంటే ముందు పేట, విశ్వాసం, ఎఫ్-2, లూసిఫర్ సినిమాలు మాత్రమే ఉన్నాయి. ఇదే ఊపు కొనసాగితే మరో 5 రోజుల్లో కాంచన-3 సినిమా ఎఫ్-2, లూసిఫర్ వసూళ్లను క్రాస్ చేయడం గ్యారెంటీ అంటోంది ట్రేడ్.

కాంచన-3 ఊహించని విజయం సాధించడంతో కాంచన-4 కూడా ఎనౌన్స్ చేశాడు లారెన్స్. ప్రస్తుతం ఈ దర్శకుడు బాలీవుడ్ లో కాంచన సినిమాను రీమేక్ చేస్తున్నాడు. ఆ సినిమా కంప్లీట్ అయిన వెంటనే.. కాంచన-4 ను స్టార్ట్ చేస్తాడు.