Telugu Global
NEWS

చంద్రబాబులో అంతర్మథనం!

తెలుగుదేశం అధినేత చంద్రబాబు అంతర్మథనం చెందుతున్నారా? ఎన్నికలకు ముందు తాము తప్పులు చేశామని భావిస్తున్నారా? అంటే అవుననే అంటున్నారు రాజకీయ పరిశీలకులు. ఎన్నికల ప్రచారంలో తాము ప్రత్యర్థుల మీద విరుచుకుపడిన తీరు.. చేసిన వ్యాఖ్యానాలు బూమరాంగ్ అయ్యాయేమోనని చంద్రబాబు ఆలోచనలో పడ్డారని, ఇవే తమ కొంప ముంచుతాయేమోనని ఆందోళన చెందుతున్నారని అంటున్నారు. నిజానికి చంద్రబాబు ఈసారి ఎన్నికల ప్రచారంలో తన ప్రత్యర్థుల మీద, ఎన్నికల సంఘం మీద తీవ్రంగానే మండిపడ్డారు. ఒక్కోసారి అసహనమూ, ఆగ్రహావేశాలూ వ్యక్తం చేసారు. […]

చంద్రబాబులో అంతర్మథనం!
X

తెలుగుదేశం అధినేత చంద్రబాబు అంతర్మథనం చెందుతున్నారా? ఎన్నికలకు ముందు తాము తప్పులు చేశామని భావిస్తున్నారా? అంటే అవుననే అంటున్నారు రాజకీయ పరిశీలకులు.

ఎన్నికల ప్రచారంలో తాము ప్రత్యర్థుల మీద విరుచుకుపడిన తీరు.. చేసిన వ్యాఖ్యానాలు బూమరాంగ్ అయ్యాయేమోనని చంద్రబాబు ఆలోచనలో పడ్డారని, ఇవే తమ కొంప ముంచుతాయేమోనని ఆందోళన చెందుతున్నారని అంటున్నారు.

నిజానికి చంద్రబాబు ఈసారి ఎన్నికల ప్రచారంలో తన ప్రత్యర్థుల మీద, ఎన్నికల సంఘం మీద తీవ్రంగానే మండిపడ్డారు. ఒక్కోసారి అసహనమూ, ఆగ్రహావేశాలూ వ్యక్తం చేసారు. ఎన్నడూ లేని విధంగా ఆయన మాట్లాడుతున్న తీరు కూడా చాలా మందిని ఆశ్చర్యానికి గురి చేసిందని చెబుతున్నారు.

ఎన్నికలకు సరిగ్గా ఏడాది ముందుగా కేంద్ర కేబినెట్ నుంచి టీడీపీ బయటకు వచ్చింది. మంత్రులు రాజీనామా చేశారు. ఆ తరువాత నుంచే చంద్రబాబు బీజేపీ మీద తీవ్రంగా విరుచుకుపడడం ప్రారంభించారు. చివరకు అది బీజేపీ, టీడీపీల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే స్థాయికి చేరుకుంది. బాబు మాత్రం క్రమంగా డోసు పెంచుకుంటూ పోయారు. ఇప్పుడు ఇదే విషయంలో చంద్రబాబు అంతర్మథనం చెందుతున్నట్టు సమాచారం.

బీజేపీ మీద తీవ్ర విమర్శలు చేయడమే కాకుండా, ఇటు జగన్ మీదా, అటు కేసీఆర్ మీదా తీవ్ర విమర్శలే చేశారు. అయితే “చేతులు కాలాక ఆకులు పట్టుకున్న” చందంగా తాము ఇంతగా రియాక్ట్ కాకపోయి ఉంటే బాగుండేదని భావిస్తున్నట్టు సమాచారం.

కేంద్రంలో కాంగ్రెస్ ఆశించిన రీతిలో బలం పుంజుకోవడం లేదు. బీజేపీకి కూడా పూర్తి మెజారిటీ వచ్చే అవకాశాలు లేవు. కానీ, అతి పెద్ద పార్టీగా మాత్రం బీజేపీ నిలిచే అవకాశాలు ఉన్నాయని, చిన్నా చితకా పార్టీలను కలుపుకొని కమలనాథులే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశాలు ఉన్నాయని చంద్రబాబు భావిస్తున్నట్టు సమాచారం.

అదీ కాక రెండు రోజుల క్రితం ప్రధాని మోడీ ఎన్నికల ప్రచార సభలో మాట్లాడుతూ మమతా దీదీకి చెందిన దాదాపు 40 మంది ఎమ్మెల్యేలు తమతో టచ్ లో ఉన్నారని, తాము కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేశాక వారంతా తమ పార్టీలో చేరతారని సంచలన వ్యాఖ్యలు చేశారు.

ఇవి కూడా చంద్రబాబులో ఆందోళననూ, ఆలోచననూ పెంచాయని అంటున్నారు. తాను నడిచిన బాటలోనే బీజేపీ నడిచి, తాను గెలిపించుకున్న కొద్దో గొప్పో ఎంపీలను కూడా మోడీ లాగేసుకుంటారేమోననే భయం బాబును వెంటాడుతోందని అంటున్నారు.

First Published:  1 May 2019 3:50 AM GMT
Next Story