మహారాష్ట్రలో దారుణం…. మావోయిస్టుల దాడిలో 16 మంది మృతి

మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లాలో మావోయిస్టుల విధ్వంసకాండ కొనసాగుతోంది. నిన్న రాత్రి దాదాపూర్‌లో 36 వాహనాలకు నిప్పు పెట్టిన మావోయిస్టులు ఇవాళ తాజాగా పోలీస్ వాహనంపై ఐఈడీ పేల్చడంతో ఒక డ్రైవర్ సహా 16 మంది భద్రతా సిబ్బంది మృతి చెందారు.

నిన్న రాత్రి మావోయిస్టులు తగులబెట్టిన వాహనాలను పరిశీలించేందుకు క్విక్ రెస్పాన్స్ టీం బయలుదేరింది. అయితే ముందుగానే ఈ విషయాన్ని పసిగట్టిన మావోయిస్టులు పోలీసుల వాహనంపై బాంబులతో దాడి చేశారు. కుర్‌కెదాలోని లెంధరీ నల్లా దగ్గరకు వచ్చేసరికి ఐఈఢీ పేల్చారు. దీంతో 16 మంది అక్కడికక్కడే మరణించారు. పోలీసులు ప్రయాణిస్తున్న వాహనం తునాతునకలైంది. దాడి తర్వాత మావోయిస్టులు అక్కడి నుంచి పారిపోతుండగా పోలీసులు కాల్పులు జరిపారు.

ఇప్పటికీ ఆ ప్రదేశంలో మావోయిస్టులకు పోలీసులకు మధ్య కాల్పులు కొనసాగుతున్నాయి. కాగా, పురాందా – మాలేగావ్ – ఎర్కడ్ మధ్య జాతీయ రహాదారిని అమర్ ఇన్‌ఫ్రా అనే కంపెనీ నిర్మిస్తోంది. దీని కోసం అమర్ సంస్థ ఒక ప్లాంట్ ఏర్పాటు చేసింది. ఇక్కడే వాళ్ల వాహనాలను పార్క్ చేశారు. నిన్న రాత్రి ఆ ప్లాంట్‌లోనికి చొరబడిన మావోయిస్టులు వాహనాలకు నిప్పుపెట్టారు. దీంతో 10 కోట్ల రూపాయల మేర ఆస్తి నష్టం చేకూరింది. దీన్ని పరిశీలించడానికి వెళ్తున్న భద్రతా దళాలపైనే మావోయిస్టులు దాడి చేశారు.