Telugu Global
NEWS

బుల్లి పరిషత్తులు @తెలంగాణ

తెలుగుదేశం పార్టీ 1985లో రెండోసారి అధికారంలోకి వచ్చాక అప్పటి ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు భారీ సంస్కరణలకు శ్రీకారం చుట్టారు. అందులో భాగంగానే 1987లో మండలాలను ఏర్పాటు చేశారు. ఫలితంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఉన్న పంచాయతీ సమితులన్నీ రెండు నుంచి ఐదు మండలాలుగా విడిపోయాయి. ఒక్కో పంచాయతీ సమితిలో దాదాపు వంద గ్రామాల వరకు ఉండేవి. ఆయా గ్రామాల సర్పంచులే అందులో సభ్యులుగా ఉండేవారు. తమలో ఒకరిని అధ్యక్షుడిగా ఎన్నుకునేవారు. మండలాల ఆవిర్భావం తరువాత ఒక్కో మండలంలో […]

బుల్లి పరిషత్తులు @తెలంగాణ
X

తెలుగుదేశం పార్టీ 1985లో రెండోసారి అధికారంలోకి వచ్చాక అప్పటి ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు భారీ సంస్కరణలకు శ్రీకారం చుట్టారు. అందులో భాగంగానే 1987లో మండలాలను ఏర్పాటు చేశారు. ఫలితంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఉన్న పంచాయతీ సమితులన్నీ రెండు నుంచి ఐదు మండలాలుగా విడిపోయాయి.

ఒక్కో పంచాయతీ సమితిలో దాదాపు వంద గ్రామాల వరకు ఉండేవి. ఆయా గ్రామాల సర్పంచులే అందులో సభ్యులుగా ఉండేవారు. తమలో ఒకరిని అధ్యక్షుడిగా ఎన్నుకునేవారు. మండలాల ఆవిర్భావం తరువాత ఒక్కో మండలంలో 15 నుంచి 35 వరకు గ్రామాలను చేర్చారు.

మండల, జిల్లా పరిషత్ ల అధ్యక్ష పదవులకు నేరుగా ఎన్నికలు నిర్వహించారు. 1994లో ఎంపీటీసీలు, జడ్పీటీసీల వ్యవస్థ అమలులోకి వచ్చింది. అప్పటి నుంచి ఎంపీటీసీ, జడ్పీటీసీలు తమలో ఒకరిని అధ్యక్షుడిగా ఎన్నుకుంటూ వస్తున్నారు. దీర్ఘకాల ఉద్యమం తరువాత తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించింది.

తెలంగాణలో అధికారంలోకి వచ్చిన తరువాత ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్రంలోని పది జిల్లాలను 33 జిల్లాలుగా విభజించారు. కొత్త మండలాలు కూడా ఊపిరి పోసుకున్నాయి. ఇప్పుడు వీటన్నింటికి ఎన్నికలు జరుగుతున్నాయి.

ఇక్కడే పలు విచిత్రాలు చోటు చేసుకుంటున్నాయి. చాలా జిల్లాలలో జడ్పీటీసీల సంఖ్య భారీగా తగ్గిపోయింది. ప్రభుత్వం దీనిని పాలన వికేంద్రీకరణగా చెప్పుకుంటున్నా, పలు చోట్ల పరిస్థితి మరీ విచిత్రంగా ఉంది.

మేడ్చల్ జిల్లాలో ఐదు జడ్పీటీసీ స్థానాలు మాత్రమే ఉన్నాయి. ఇందులో ఒకరు చైర్మన్ అయితే, ఇంకొకరు వైస్ చైర్మన్ అవుతారు. ముగ్గురు మాత్రం సభ్యులుగా మిగులుతారు. ఇటువంటి జిల్లాలు మరో రెండు, మూడు ఉన్నాయి. ఒక జిల్లాలో ఆరు స్థానాలు ఉంటే, మరో జిల్లాలో తొమ్మిది స్థానాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా బుల్లి జిల్లా పరిషత్ లుగా ఏర్పడనున్నాయి.

పంచాయతీ సమితులు ఉన్నపుడు కూడా జిల్లాపరిషత్ లలో పది నుంచి పదహారు మంది సభ్యులుగా ఉండేవారు. కానీ, పరిధులు మాత్రం విశాలంగా ఉండేవి.

విచిత్రమేమిటంటే ఇప్పుడు సభ్యుల సంఖ్య తక్కువగానే ఉంది. పరిధులు కూడా చిన్నవిగా ఉన్నాయి. ఇదే పరిస్థతి కొత్తగా ఏర్పడిన మండలాలలోనూ నెలకొని ఉంది. నలుగురు, ఐదుగురు కలిగిన మండలపరిషత్ లు చాలానే ఉన్నాయి. 1987లో మండలాలు ఏర్పడినపుడు కాంగ్రెస్ వాటిని తీవ్రంగానే వ్యతిరేకించింది.

తాము అధికారంలోకి వచ్చాక వాటిని రద్దు చేస్తామనీ చెప్పింది. 1989లో తమకు అధికారం లభించినప్పటికీ ఆ పని మాత్రం చేయలేకపోయింది. ఎందుకంటే అప్పటికే చిన్న చిన్న మండలాలు ప్రజాదరణను పొందాయి. మరి ఇప్పుడు కూడా అంతేనా?! అధికారంలో ఉన్న వారు ఎప్పుడు ఏం చేసినా అది భవిష్యత్ లో మంచి చేస్తుందా…? లేక చేటు తీసుకువస్తుందా…? అని యోచించకపోవడమే కారణమని రాజకీయ పరిశీలకులు అంటున్నారు.

First Published:  1 May 2019 10:52 PM GMT
Next Story