Telugu Global
NEWS

బాబూ... ఇదా ఘనమైన పాలన?

‘‘మేం ఘనమైన పాలకులం.. మాది ఘనమైన పాలన… మా పాలనకు ఎవ్వరూ సాటి రారు’’ అని చంద్రబాబు ఘనంగా చెప్పుకుంటూ ఉంటారు. కరువును తరిమి కొట్టామని, తుఫానును నిలువరించామని పదే పదే ప్రకటించుకుంటూ ఉంటారు. మరి అంత ఘనమైన పాలకులు ఆకలి చావులను మాత్రం ఎందుకు ఆపలేకపోయారని ప్రశ్నిస్తున్నారు. అనంతపురం జిల్లాలో ఆకలికి తట్టుకోలేక మట్టి తిని కడుపు నింపుకుని, చివరికి కడుపు పగిలి ఓ చిన్నారి మరణించిన ఘటన ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. కర్ణాటక […]

బాబూ... ఇదా ఘనమైన పాలన?
X

‘‘మేం ఘనమైన పాలకులం.. మాది ఘనమైన పాలన… మా పాలనకు ఎవ్వరూ సాటి రారు’’ అని చంద్రబాబు ఘనంగా చెప్పుకుంటూ ఉంటారు. కరువును తరిమి కొట్టామని, తుఫానును నిలువరించామని పదే పదే ప్రకటించుకుంటూ ఉంటారు. మరి అంత ఘనమైన పాలకులు ఆకలి చావులను మాత్రం ఎందుకు ఆపలేకపోయారని ప్రశ్నిస్తున్నారు.

అనంతపురం జిల్లాలో ఆకలికి తట్టుకోలేక మట్టి తిని కడుపు నింపుకుని, చివరికి కడుపు పగిలి ఓ చిన్నారి మరణించిన ఘటన
ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. కర్ణాటక నుంచి పొట్ట చేత పట్టుకుని వలస వచ్చిన ఓ నిరుపేద కుటుంబం అనంతపురం జిల్లాలోని ఓ ప్రాంతంలో చిన్న గుడారం వేసుకుని బతుకుతోంది. ఆ కుటుంబానికి చెందిన చిన్నారే ఈ దారుణ మరణానికి గురైంది.

సాంకేతికంగా ఎంతో అభివృద్ధి చెందామని చెప్పుకుంటున్న కాలంలో ఇంకా ఆకలిచావులు చోటు చేసుకోవడం సిగ్గుపడాల్సిన విషయమని అంటున్నారు. గొప్పగా అభివృద్ధి చేయడం అంటే పేదలకు కనీసం ఒక పూట తిండిని సమకూర్చలేని స్థితికి చేరుకోవడమా అని ప్రశ్నిస్తున్నారు.

శోచనీయమైన విషయం ఏమిటంటే అధికార యంత్రాంగం కూడా ఈ పరిస్థితిని పట్టించుకోకపోవడం. ఏడాది కాలంగా ఓ కుటుంబం ఎండకు, వానకు, చలికి తట్టుకోలేని ఓ చిన్న గుడారంలో బతుకుతుంటే, అన్నం లేక, ఆకలిని తట్టుకోలేక ఆ కుటుంబంలోని ఓ చిన్నారి నెలల పాటు మట్టి తిని బతుకుతుంటే పట్టించుకోకపోవడం క్షమించరాని విషయం అని పేర్కొంటున్నారు.

చివరికి ఈ ఆకలి చావు వెలుగు చూసిన తరువాత అయినా పాలకులు సరిగా స్పందించకపోవడం విచారకరమని అంటున్నారు. ఆఖరుకు స్థానికంగా ఉన్న మానవతావాదులు కొందరు ఆ కుటుంబాన్ని ఆదుకోవడానికి ముందుకు వచ్చారు.

ఓ ఎస్ ఐ వారికి నీడ కల్పించేందుకు ఓ గది నిర్మించి ఇస్తానని హామీ ఇచ్చారు. మరి కొందరు వారి పిల్లలను చదివించేందుకు, వారికి వసతి గృహంలో ఆశ్రయం కల్పించేందుకు పూనుకున్నారు.

ఈ మాత్రం స్పందన ప్రభుత్వం నుంచి ఎందుకు లేదని పలువురు ప్రశ్నిస్తున్నారు. పేదల కడుపు నింపేందుకు ప్రవేశపెట్టిన ఉపాధి హామీలాంటి పథకాలు ఏమవుతున్నాయని ప్రశ్నిస్తున్నారు. కడుపు నింపని పథకాలు ఎన్ని ఉన్నా లాభం ఏమిటో చెప్పాలంటున్నారు.

First Published:  3 May 2019 1:23 AM GMT
Next Story