గడ్చిరోలి పేలుడు వెనుక మావోయిస్టు ఛీఫ్

మహారాష్ట్రలోని గడ్చిరోలిలో ఐఈడీ బాంబులు పేల్చి 16 మంది పోలీసులు చనిపోవడానికి కారణమైన ఘటన వెనుక కీలక సూత్రధారిని మహారాష్ట్ర పోలీసులు గుర్తించారు.

సీపీఐ (మావోయిస్టు) పార్టీ ఛీఫ్ నంబాల కేశవరావు ఈ దాడికి నేతృత్వం వహించినట్లు పోలీసులు ఒక నిర్థారణకు వచ్చారు. ఈ దాడికి ప్రణాళిక రచించిన దగ్గర నుంచి అమలు పరిచే వరకు నంబాల అంతా తానై నడిపించినట్లు తెలుస్తోంది.

మావోయిస్టు అధినేతగా ముప్పాళ్ల లక్ష్మణరావు అలియాస్ గణపతి తప్పుకున్న తర్వాత ఆ పోస్టుకు నంబాలను ఎన్నుకున్నారు. గతంలో మావోయిస్టు పార్టీ నిర్వహించిన అనేక గెరిల్లా ఆపరేషన్లకు నంబాలనే వ్యూహకర్త.

ఇక ఆయన మావోయిస్టు ఛీఫ్ అయ్యాక ఎటాకింగ్ ఆపరేషన్లు ఎక్కువయ్యాయి. తన వ్యూహాలకు పదును పెడుతూ.. మావోయిస్టుల అణచివేతను అతను తిప్పికొడుతున్నాడు. చత్తీస్‌గడ్, మహారాష్ట్ర పరిధిలో ఇటీవల కాలంలో భద్రతాదళాలపై దాడులు జరగడానికి నంబాలనే కారణమని తెలుస్తోంది.

మావోయిస్టుల ప్రాబల్యం తగ్గిపోతోందని ప్రచారం జరుగుతున్న వేళ ఏపీ, మహారాష్ట్ర, చత్తీస్‌గడ్ ప్రాంతాల్లో భీకరదాడులతో పార్టీలో తిరిగి ఉత్తేజం నింపే పనిలో ఉన్నారు.

విశాఖ జిల్లా అరకులో ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు, శివేరు సోమ హత్యలకు నంబాలనే పథకం రచించినట్లు తెలుస్తోంది. అలాగే ఇటీవల చత్తీస్‌గడ్‌లోని దంతెవాడలో బీజేపీ ఎమ్మెల్యే కాన్వాయ్ పేలుడులో కూడా నంబాల కీలకంగా వ్యవహరించినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.

నంబాల కోసం తెలంగాణ, ఏపీ, చత్తీస్‌గడ్, మహారాష్ట్ర పోలీసులతో పాటు నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ కూడా తీవ్రంగా వెదుకుతోంది.